బీఆర్‌ఎస్‌ది అసమర్థ పాలన 

1 Oct, 2023 03:55 IST|Sakshi

తెలంగాణ ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు: మోదీ 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ వంశపారంపర్య పార్టీలేనని ఫైర్‌ 

వాటికి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేదని మండిపాటు.. 

నేడు పాలమూరులో ప్రధాని పర్యటన 

భారీగా అభివృద్ధి కార్యక్రమాలు.. 

ఆ వెంటనే రాజకీయసభతో ద్విముఖ వ్యూహం.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన సాయాన్ని ప్రస్తావించనున్న మోదీ 

ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలను ఎండగట్టే చాన్స్‌ 

ఈ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్టే అంటున్న బీజేపీ వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, న్యూఢిల్లీ:  తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అసమర్థ పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌పైనా అంతే అవిశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేని వంశపారంపర్య పార్టీలేనని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌ (ట్విట్టర్‌)’లో ట్వీట్‌ చేశారు.

ఆదివారం మహబూబ్‌నగర్‌లో తెలంగాణ బీజేపీ నేతృత్వంలో జరిగే బహిరంగ సభలో తాను ప్రసంగించనున్నట్టు మోదీ తెలిపారు. అక్కడ రూ.13,500 కోట్లకుపైగా విలువైన రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వే, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.

ప్రధాని మోదీ ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో, 3వ తేదీన నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోపాటు బీజేపీ నిర్వహించే ప్రజాగర్జన బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు. ఈ పర్యటనల సందర్భంగా అటు అభివృద్ధి మంత్రం, ఇటు రాజకీయ తంత్రంతో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. 

మోదీ పాలమూరు పర్యటన ఇలా.. 
ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎంఐ–17 సైనిక హెలికాప్టర్‌లో బయలుదేరి 2.05 గంటలకు పాలమూరుకు చేరుకుంటారు. 2.15 గంటల నుంచి 2.50 గంటల వరకు వివిధ ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమం ఉంటుంది. తర్వాత కాస్త దూరంలో విడిగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేదిక వద్దకు వస్తారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.45 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం అవుతారు.  

బీఆర్‌ఎస్‌పై నేరుగా దాడే! 
ప్రధాని మోదీ పాలమూరులో జరిగే బీజేపీ సభలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖారావం పూరిస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో పూర్తి స్థాయి రాజకీయ ప్రసంగం చేస్తారని, తొమ్మిదేళ్ల కేసీఆర్‌ పాలన వైఫల్యాలు, హామీల అమలు, కేంద్రం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ నిరాకరణ వంటి అంశాలపై నిలదీస్తారని అంటున్నాయి. ప్రసంగంలో భాగంగా కేసీఆర్‌ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలనపైనా ఘాటుగా విమర్శలు గుప్పించే అవకాశం ఉందని నేతలు చెప్తున్నారు.

గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో విమర్శల దాడి ఉంటుందని.. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రత్యామ్నాయంగా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు మోదీ పిలుపునిస్తారని అంటున్నారు. ఇదే సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను వివరిస్తారని.. కేంద్రం నుంచి తెలంగాణకు అందిన సాయాన్ని గణాంకాలతో వెల్లడిస్తారని చెప్తున్నారు.

దీనితోపాటు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు, మూడు వరాలు, ప్రకటనలు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తొలి కేబినెట్‌ భేటీలోనే పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించవచ్చని.. విద్య, వైద్యం వంటి కీలక అంశాలపైనా హామీలు ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీపైనా మోదీ ఘాటుగా విమర్శలు గుప్పిస్తారని వివరిస్తున్నారు. 

3న పసుపు బోర్డుపై ప్రకటన? 
మంగళవారం (3న) నిజామాబాద్‌ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పసుపుబోర్డు ఏర్పాటును ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నందున దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని అంటున్నారు.   

మరిన్ని వార్తలు