మోదీ బలపడుతున్నారంటే.. కాంగ్రెస్‌దే పాపం

31 Oct, 2021 05:12 IST|Sakshi

పొత్తు పెట్టుకునే అవకాశాలను కాంగ్రెస్‌ వదులుకుందంటూ మమతా బెనర్జీ ఫైర్‌  

పనాజీ: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోదీ బలపడడానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని నిందించారు. కాంగ్రెస్‌ రాజకీయాల్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని, దీంతో మోదీ బలీయమైన శక్తిగా మారుతున్నారని దుయ్యబట్టారు. మోదీకి ప్రచారం చేయడానికి కాంగ్రెస్‌ ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. మరోవైపు బీజేపీపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాదాగిరిని సహించే ప్రసక్తే లేదని దీదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవాలో మూడు రోజుల పర్యటనను ముగించుకున్న మమతా బెనర్జీ శనివారం విలేకరులతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని రేసులో మీరుంటారా అని విలేకరుల అడిగిన ప్రశ్నకు తాను ఎప్పుడూ ఎల్‌ఐపీ (లెస్‌ ఇంపార్టెంట్‌ పర్సన్‌)గా , వీధిపోరాటాలు చేసే వ్యక్తిగా ఉండాలనే కోరుకుంటున్నానని చెప్పారు.  

కాంగ్రెస్‌ నిర్ణయాలు తీసుకోలేదు: కాంగ్రెస్‌ పార్టీకి నిర్ణయాలు తీసుకోవడం చేతకావడం లేదని దీంతో దేశం బాధపడే పరిస్థితులు వచ్చాయని మమత వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలను ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆ పార్టీ వల్లే మోదీ మరింత శక్తిమంతంగా ఎదుగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి టీఆర్‌పీ రేటింగ్‌లా ఉంది. ఆ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల దేశం బాధపడాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగడానికి కాంగ్రెస్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా ఆ పార్టీ అందిపుచ్చుకోలేదు.

ఆ పార్టీ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే దేశం ఎందుకు నష్టపోవాలి’’ అని మమత ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సమయంలో తమ పార్టీతో జత కట్టే అవకాశాన్ని కాంగ్రెస్‌ వదులుకొని లెఫ్ట్‌తో చేతులు కలిపిందని, అలా చేయడం వల్ల ఒక్క స్థానంలో కూడా వాళ్లు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పోరాడడానికి బదులు కాంగ్రెస్‌ పార్టీ తమతో పెట్టుకుందని, దానికి తగ్గ ఫలితాన్ని చూసిందని మమత వ్యాఖ్యానించారు.  ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే రాష్ట్రాలు బాగుంటాయని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా బాగుంటుందని మమత అన్నారు.     

మరిన్ని వార్తలు