ప్రతిపక్షాలది దగాకోరు రాజకీయం

3 Oct, 2021 04:17 IST|Sakshi

బూటకపు మేథోతనాన్ని ప్రదర్శిస్తున్నాయి

సంస్కరణలపై వెన్నుచూపుతున్నాయి

విపక్షాలపై మోదీ తీవ్ర విమర్శలు

స్వావలంబనతోనే కరోనా టీకా తయారైందన్న ప్రధాని  

న్యూఢిల్లీ: తమ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ప్రతిపక్షాలు బూటకపు మేధోతనాన్ని, దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. దశాబ్దాల క్రితమే అనేక ప్రయోజనాలు పొందాల్సిన ప్రజలకు ఇంతవరకు ఎలాంటి ఫలాలు అందలేదని, అలాంటివారికి సరైన ఫలితాలు అందించాలంటే భారీ, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఓపెన్‌ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. నూతన సాగు చట్టాలు, జీఎస్‌టీ అమలు, ఆధార్, నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణం తదితర అనేక అంశాలపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన దుయ్యబట్టారు. ఈ అంశాలన్నింటిపై తొలుత ఏకీభవించిన తర్వాత రాజకీయ కారణాలతో విపక్షాలు యూటర్న్‌ తీసుకొని ద్వేషపూరిత ప్రచారం ఆరంభించాయని ఆరోపించారు. ప్రస్తుతం సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నవారిని చూస్తే ప్రజలకు బూటకపు మేధోతనం, దగాకోరుతనమంటే ఏమిటో తెలుస్తోందన్నారు.

ఒక రాజకీయ పార్టీ ఒక వాగ్దానమిచ్చి తర్వాత నెరవేర్చలేకపోవడం వేరని, కానీ సంస్కరణలపై ముందు ఏకీభవించి తర్వాత యూటర్న్‌ తీసుకొని దు్రష్పచారం చేయడం సహించరానిదని ఆరోపించారు. ఇప్పుడు తమ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవారే వారివారి మేనిఫెస్టోల్లో ఇవే అంశాలను పొందుపరిచారని, అయితే ప్రజామోదం పొందిన తమ పార్టీ వీటిని అమలు చేయడంతో సహించలేక అనైతికంగా వ్యవహిస్తున్నారని విమర్శించారు. రైతులకు ఏది ప్రయోజనం అని ఆలోచించకుండా తమ రాజకీయాలకు ఏది ప్రయోజనమని విపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు.

కరోనా కట్టడిలో భేష్‌
అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా కరోనాను కట్టడి చేయడంలో భారత్‌ ఎంతో మెరుగ్గా వ్యవహరించిందని మోదీ చెప్పారు. కోవిడ్‌ విషయంలో తమ ప్రభుత్వ చర్యలను విమర్శించిన వారిపై ఆయన విరుచుకుపడ్డారు. వీరి లక్ష్యం అంతర్జాతీయంగా భారత్‌ పేరును నాశనం చేయడమేనని నిప్పులు చెరిగారు. కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడ్డాయని, మనం మాత్రం నెగిటివ్‌ ప్రచారాలను తట్టుకొని కరోనా కట్టడిలో మెరుగ్గా వ్యవహరించామని చెప్పారు.

అవసరం వచి్చనప్పుడు ఇండియా ఐక్యంగా నిలబడుతుందనే పాఠాన్ని కోవిడ్‌ తెలియజేసిందన్నారు.  ‘‘భారత్‌ టీకాను రూపొందించకపోతే ఏమయ్యేదో ఆలోచించండి. పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పటికీ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కోవిడ్‌ టీకా లభించడం లేదు. కానీ మనం వ్యాక్సినేషన్‌లో విజయవంతం అయ్యాము.’’అని చెప్పారు. స్వాలంబంన(ఆత్మనిర్భరత) ఇందుకు కారణమన్నారు. విమర్శలను తాను స్వాగతిస్తానని, ఆరోగ్యవంతమైన పురోగతికి ఇవి అవసరమని ఆయన చెప్పారు. కానీ అలాంటి నిజమైన విమర్శలు చాలా స్వల్పమని, అసంబద్ధ ఆరోపణలే అధికమని విచారం వ్యక్తం చేశారు.

మిమ్మల్ని మీరే అవహేళన చేసుకుంటున్నారు
నూతన పార్లమెంటు ఆవశ్యకతపై గొంతెత్తిన పారీ్టలే నేడు తాము నిర్మిస్తున్న నూతన భవన సముదాయాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ఇది వారిని వారు అవహేళన చేసుకోవడమేనని మోదీ ఎద్దేవా చేశారు. గతంలో ఈ పార్టీల నేతలు కొత్త భవనం కావాలని కోరలేదా? అని ప్రశ్నించారు. దాన్ని సాకారం చేయాలని యతి్నస్తుంటే ఏవో కుంటిసాకులతో వ్యతిరేకించడం ఎంతవరకు సబబన్నారు. నిజానికి దేశ ప్రజలకు అనేక ప్రయోజనాలు దశాబ్దాల క్రితమే అందాల్సిఉందని, కానీ ఇంతవరకు వీరికి సరైన ఫలాలు అందలేదని వివరించారు. అలాంటివారికి సత్ఫలితాలివ్వడానికి పనిచేస్తున్నామని, ఇందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తే తీసుకుంటామని చెప్పారు.

ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో చర్చలకు సిద్ధమని తమ ప్రభుత్వం తొలినుంచి చెబుతోందని గుర్తు చేశారు. ఇప్పటికి అనేక మార్లు వారితో చర్చలు జరిపామని, కానీ నిజానికి చట్టాల్లో ఏం మార్చాలో వారికే స్పష్టత లేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలన్నీ కాం గ్రెస్‌ గోత్రీకుల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యేవని ఎద్దేవా చేశారు. అందుకే గత ప్రభుత్వాలన్నీ ఒకేవిధమైన రాజకీయ, ఆర్థిక ఆలోచనతో వ్యవహరించాయని, కానీ తొలిసారి వాజ్‌పేయికి ప్రజలు ప్రత్యామ్నాయ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తన హయాంలో తొలిసారి కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారన్నారు. ప్రజలు సంపూర్ణ మార్పు కోరారనేందుకు ఇదే నిదర్శనమన్నారు.

మరిన్ని వార్తలు