ఇదేం పద్ధతి.. కాంగ్రెస్‌ ధోరణిని ఎండగట్టాలి

28 Jul, 2021 07:47 IST|Sakshi

కేంద్రం చర్చించడానికి సిద్ధమైనా.. అడ్డుకుంటోంది: ప్రధాని మోదీ       

న్యూఢిల్లీ: పెగసస్‌ స్పైవేర్, రైతు సమస్యల అంశాల్లో పార్లమెంటు సమావేశాలు జరగనివ్వకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వర్షాకాల సమావేశాలకు అడుగుడగునా ఆటంకం కల్పిస్తున్న కాంగ్రెస్‌ అనుచిత వైఖరిని మీడియాలోనూ, ప్రజల్లోనూ ఎండగట్టాలని బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్‌ పార్టీని నిందిస్తూ ప్రసంగించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఉభయ సభల్ని అడ్డుకుంటోందని మోదీ మండిపడ్డారు.

దేశంలో కరోనా పరిస్థితిపై గత వారంలో జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించడమే కాకుండా, ఇతర పార్టీలు హాజరవకుండా అడ్డుకుందని, ఇదేం పద్ధతంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆరంభమైన దగ్గర్నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. కాగా, దేశ 75వ స్వాతంత్య్రదిన వేడుకల్లో ప్రజల్ని కూడా భాగస్వామ్యుల్ని చేయాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు చెప్పారు. ఎంపీలందరూ నియోజకవర్గంలోని ప్రతీ పల్లెలో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే 25 ఏళ్లలో దేశాభివృద్ధి కోసం ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా ఒక ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందుకోసం కూడా ప్రజల దగ్గర నుంచి కొత్త ఆలోచనలు స్వీకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి మేఘ్‌వాల్‌  చెప్పారు. 

మరిన్ని వార్తలు