అబద్ధాల పునాదులపై మోదీ ఓట్లు అడుగుతున్నారు.. రాహుల్‌ సీరియస్‌ వ్యాఖ్యలు

5 Mar, 2022 13:57 IST|Sakshi

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం అబద్ధాల పునాదులపై ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. అబద్ధాలు ఆడొచ్చని హిందూ మత గ్రంథాలు ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు.

రైతుల ఆదాయం రెండింతలు చేస్తాం, యువత కోసం ఉద్యోగాలు సృష్టిస్తాం అంటూ మోదీ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆ సంగతే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా శుక్రవారం కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిండిరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ ఎన్నడూ మాట తప్పలేదని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ధర్మం పేరిట ఓట్లు అడగాల్సింది పోయి అబద్ధాలను ఆధారంగా చేసుకొని ఓట్ల వేట సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

నరేంద్ర మోదీ తరచూ చెబుతున్న డబుల్‌ ఇంజన్‌ అంటే అదానీ, అంబానీ మాత్రమేనని రాహుల్‌ ఎద్దేవా చేశారు. ఇలాంటి డబుల్‌ ఇంజన్‌ ప్రజలకు ఉద్యోగాలు కల్పించలేదని తేల్చిచెప్పారు. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా అనుకూల అజెండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు