పేదలపై కాంగ్రెస్‌ కపట ప్రేమ!

8 Aug, 2021 03:27 IST|Sakshi

ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

ఉపాధి కల్పనపై దృష్టి పెట్టినట్లు వెల్లడి

భోపాల్‌: కాంగ్రెస్‌ గత ప్రభుత్వాలన్నీ పేదలపై కపట ప్రేమ చూపాయని, రోజుకు వందసార్లు పేదలంటూ పాట పాడడమే కానీ, వారికి చేసింది శూన్యమని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పీఎంజీకేఏవై లబ్దిదారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గత ప్రభుత్వాల కారణంగా వ్యవస్థ వక్రగతి పట్టిందని దుయ్యబట్టారు. తమ పాలనలో ప్రభుత్వ పనితీరు మారిందని, పలు పథకాల ప్రయోజనాలు నిజంగా లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. నిరుద్యోగిత సమస్యను నివారించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ‘ప్రభుత్వ పనితీరులో మార్పు వల్ల ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయి.

గత ప్రభుత్వాల హయంలో పాలన అపమార్గం పట్టింది. పేదలపై ప్రశ్నలు, జవాబులు వారే ఇచ్చుకునేవారు’అని ఆయన విమర్శించారు. పేదలపై కేవలం కపట సానుభూతిని మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చూపాయని ఆరోపించారు. తమ ప్రభుత్వ చర్యలతో కరోనా సమయంలో దాదాపు 80 కోట్ల మంది భారతీయులకు ఉచిత రేషన్‌ సదుపాయం అందిందని, వీరిలో ఐదు కోట్ల మంది మధ్యప్రదేశ్‌కు చెందినవారిని మోదీ చెప్పారు.   కరోనా మహమ్మారిలాంటి ప్రమాదాన్ని మానవాళి గత వందేళ్లలో చూడలేదని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ జనాభా ఉన్న భారత్‌లో కరోనా నియంత్రణ ఇతర దేశాలతో పోలిస్తే కష్టతరమైందన్నారు.  

నిరుద్యోగితను ఎదుర్కొంటాం
దేశంలో కరోనా కారణంగా ఏర్పడిన నిరుద్యోగితను ఎదుర్కోవడంపై దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగా మౌలిక వసతులు, నిర్మాణ రంగాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నామని, వీటి కారణంగా పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. అదేవిధంగా చిన్నపరిశ్రమలకు సాయం అందిస్తున్నామని, రైతులకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టామని తెలిపారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ను ప్రమోట్‌ చేసే క్రమంలో భారతీయులు స్వదేశీ కళాకృతులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. టోక్యో ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన పలువురు పేద కుటుంబాలకు చెందినవారని, వారంతా అద్భుత ప్రదర్శన చూపారని చెప్పారు. ఒకప్పుడు బీమారు రాష్ట్రాల్లో(దేశంలో అత్యంత అల్పాదాయం కలిగిన రాష్ట్రాలు)ఒకటిగా ఉన్న మధ్యప్రదేశ్‌ ఇటీవల కాలంలో మంచి పురోగతి సాధించిందని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు