దీదీ మోసం చేశారు

8 Mar, 2021 04:29 IST|Sakshi

మార్పు తెస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజలకు అవమానం

తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ ధ్వజం

కోల్‌కతా బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రచారం ప్రారంభించిన మోదీ

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌ ప్రజలను మోసం చేశారని, అవమానించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. వామపక్ష పాలన తరువాత రాష్ట్రంలో మంచి మార్పు వస్తుందని ఆశించిన ప్రజలను ఆమె మోసం చేశారన్నారు. అవినీతిని, సిండికేట్‌ రాజ్‌ను పెంచి పోషించారని ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన ప్రచారాన్ని ఆదివారం కోల్‌కతాలో భారీగా జరిగిన ప్రచార సభతో ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ ‘నిజమైన మార్పు’ పిలుపునివ్వగానే సభికులు ఉత్సాహంతో ఒక్కసారిగా నినాదాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధిని, ఉపాధి కల్పనను సాధిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

మమతా బెనర్జీ తమకు ‘దీదీ(సోదరి)’గా నిలుస్తారని రాష్ట్రప్రజలు ఆశిస్తే.. ఆమె మాత్రం తన తన మేనల్లుడికి అత్తగా మాత్రమే వ్యవహరించారని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని తదుపరి సీఎం చేయాలనుకుంటున్నారని బీజేపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కొద్దిమంది సన్నిహితులైన పారిశ్రామికవేత్తల కోసమే మోదీ పని చేస్తున్నారన్న విమర్శలను తిప్పికొడుతూ.. ‘భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజలు నాకు సన్నిహితులే. వారికోసమే నేను పనిచేస్తాను. బెంగాల్‌లోని నా స్నేహితులకు 90 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాను. టీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. బెంగాల్‌లోని తేయాకు కార్మికులు నా స్నేహితులే’ అని మోదీ వ్యాఖ్యానించారు.

బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్‌ షా బెంగాల్‌కు పరాయివారన్న మమత  ప్రచారాన్ని కూడా ప్రధాని తిప్పికొట్టారు. ‘ఇదే బెంగాల్‌కు చెందిన శ్యామా ప్రసాద ముఖర్జీ స్ఫూర్తి పునాదిగా ఏర్పడిన బీజేపీ పరాయిది ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు. బీజేపీ అధికారం లోకి వస్తే అసలైన మార్పు తీసుకువస్తామని, ప్రజలందరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. చొరబాట్లను అడ్డుకుంటామని, బుజ్జగిం పు రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన దళిత ‘మతువా’ వర్గం వారికి భారత పౌరసత్వం కల్పిస్తామన్నారు. ‘విద్యార్థులకు మెరుగైన విద్య, యువతకు ఉద్యోగాలు లభించడం, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, ప్రజలు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లకపోవడమే మేం తీసుకువచ్చే అసలైన మార్పు’ అని వ్యాఖ్యానించారు. భరతమాత ఆశీస్సులతో రాష్ట్రాన్ని ‘బంగారు బంగ్లా’గా మారుస్తామన్నారు. టీఎంసీ ‘ఖేలా హోబె’(ఆట మొదలైంది)’ నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘టీఎంసీ ఖేలా ఖతమ్‌..ఔర్‌ వికాస్‌ షురూ’(టీఎంసీ ఆట ముగిసింది.. అభివృద్ధి ప్రారంభమైంది) అని వ్యాఖ్యానించారు.

మార్పు తీసుకువస్తారన్న ప్రజల ఆశలను మమత, ఆమె పార్టీ నేతలు నాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్‌లు ఒకవైపు.. రాష్ట్ర ప్రజలు మరోవైపు ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రారంభించిన ఓటు బ్యాంకు రాజకీయాలను లెఫ్ట్, టీఎంసీ మరింత ముందుకు తీసుకువెళ్లాయని మండిపడ్డారు. మమత హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నాశనమైందని, అవినీతి పెచ్చుమీరిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా రాష్ట్ర ప్రజలకు అందకుండా అడ్డుకున్నారన్నారు. నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో మమత ఓడిపోవడం ఖాయమన్నారు. ‘బెంగాల్‌లో మీరు చేసిన బురదలో కమలం వికసించనుంది’ అని మమతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నినాదం అమ్మ, మట్టి, మనిషి నినాదాన్ని గుర్తు చేస్తూ.. ఆమె పాలనలో రాష్ట్రంలో తల్లులు, కూతుర్లు ఏడవని రోజు లేదని, బెంగాల్‌ మట్టిలో దళారులు, గూండాలు పెరిగారని, మనుషులు తోటి మనుషుల రక్తాన్ని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలను తరలించారు.

మరిన్ని వార్తలు