అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా.. మోదీ పర్యటనపై బీజేపీ శ్రేణుల్లో చర్చ..

12 Nov, 2022 01:56 IST|Sakshi

బీజేపీని ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సంసిద్ధం చేసే వ్యూహం 

అధికార టీఆర్‌ఎస్‌పై దూకుడుగా పోరాడేలా ఉత్సాహపరిచే అవకాశం 

‘డబుల్‌ ఇంజన్‌’ సర్కార్‌ ప్రయోజనాలను జనంలోకి తీసుకెళ్లాలనే ఆదేశాలు 

బేగంపేట సభలో రాష్ట్ర నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న ప్రధాని మోదీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఉండనుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి నుంచే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని.. అధికార టీఆర్‌ఎస్‌పై దూకుడుగా పోరాడాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారని వివరిస్తున్నాయి. శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ తొలుత బేగంపేటలో స్వాగత సభలో, తర్వాత రామగుండం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ఇందులో బేగంపేట కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న తీరుపై ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తద్వారా ముందస్తుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టవచ్చని అంటున్నాయి. 

‘డబుల్‌ ఇంజన్‌’ పిలుపుతో 
కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్తూ వస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్పే అవకాశ ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వల్ల ప్రయోజనాలు, కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని అంటున్నాయి. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మరింత కష్టపడాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని పిలుపు ఇవ్వనున్నారని వివరిస్తున్నాయి. 

ఇంతకుముందు భిన్నంగా.. 
ఈ ఏడాది మే నెలలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) స్నాతకోత్సవానికి వచ్చిన మోదీ.. బేగంపేట ఎయిర్‌పోర్టులో స్వాగత సభలో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ వారసత్వ రాజకీయాలు, ప్రభుత్వ అవినీతి, నియంత, అప్రజాస్వామిక పాలన సాగుతోందంటూ విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూఢ నమ్మకాలతో వ్యవహరిస్తోందనీ ఆరోపించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీకి వచ్చిన మోదీ సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో మాట్లాడారు. కానీ టీఆర్‌ఎస్‌ సర్కారు, సీఎం కేసీఆర్‌లపై విమర్శలేవీ చేయకుండా.. కేవలం బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. శనివారం మాత్రం ఇందుకు భిన్నంగా తనదైన శైలిలో మోదీ రాజకీయ ప్రసంగం చేయవచ్చని అంటున్నారు. ఇక రామగుండం సభలో కేంద్ర పథకాలు, అభివృద్ధిని వివరించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టవచ్చని చెప్తున్నారు. 

భారీగా కార్యకర్తలను రప్పించేలా.. 
శనివారం బేగంపేట సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రధానంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను తరలించనుంది. ఈ ఏడాది మేలో ఓవైపు ఎండ తీవ్రతతోపాటు ప్రధాని అనుకున్న సమయం కంటే ముందే రావడంతో కార్యకర్తలు సభాస్థలికి చేరుకోవడం ఆలస్యమైంది. ఈసారి ముందుగానే అంటే మధ్యాహ్నం 12 గంటలలోపే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

ఈ మేరకు ఏర్పాట్లపై శుక్రవారం రాత్రి బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, నేతలు చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎన్‌.రామచంద్రరావు, ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి తదితరులు సమావేశమై సమీక్షించారు. బేగంపేటలో మోదీకి స్వాగతం, వీడ్కోలు, రామగుండంలో స్వాగతం, వీడ్కోలు సందర్భంగా మోదీని కలుసుకునేలా పార్టీలోని వివిధ స్థాయిల నాయకులతో లైనప్‌లను ఏర్పాటు చేశారు.
చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక..

మరిన్ని వార్తలు