దీదీ ఆటలు సాగవు.. గద్దె దిగక తప్పదు

11 Apr, 2021 04:34 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ బెంగాల్‌ను హింసాత్మకంగా మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కూచ్‌బెహార్‌ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆయన శనివారం బెంగాల్‌ రాష్ట్రం నాడియా జిల్లాలోని సిలిగురి, కృష్ణానగర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొట్టి కేంద్ర బలగాలపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో నెగ్గడానికి రక్తపాతం సృష్టించి, రిగ్గింగ్‌ చేసుకోవాలన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ కుట్రలతోనే సమస్యలు వస్తున్నాయని చెప్పారు.

కూచ్‌బెహార్‌ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బెంగాల్‌లో బీజేపీకి ప్రజాదరణ పెరగడం చూసి మమతా బెనర్జీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు భరించలేకపోతున్నారని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆక్రోశం పట్టలేకపోతున్నారని, అందుకే భద్రతా సిబ్బందిపై దాడి చేయాలంటూ జనానికి నూరిపోస్తున్నారని విమర్శించారు. మళ్లీ కుర్చీ దక్కకుండా పోతోందన్న భయంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

రిగ్గింగ్‌కు అడ్డుగా ఉన్నాయన్న కారణంతోనే కేంద్ర బలగాలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దీదీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. ఆమె గద్దె దిగక తప్పదని తేల్చిచెప్పారు. బెంగాల్‌లో తాము అధికారంలోకి రాగానే లంచాల సంస్కృతికి చరమ గీతం పాడుతామన్నారు. మూడు టీలకు(టీ, టూరిజం, టింబర్‌) మాఫియా చెర విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మే 2వ తేదీ నుంచి బెంగాల్‌లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రభుత్వమే తీసుకుంటుందని, దోపిడీదార్లు కాదని మోదీ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు