అనుమతి లేకుండా పోలవరం పరిరక్షణ యాత్ర

23 Nov, 2020 04:45 IST|Sakshi

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గృహనిర్బంధం 

సోము వీర్రాజు, డీజీపీలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల అనుచిత వ్యాఖ్యలు 

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పోలవరం పరిరక్షణ పేరిట రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు ఆదివారం సీపీఐ నేతలు చేపట్టిన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రాజమహేంద్రవరంలోని హోటల్‌లో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు టూటౌన్‌ సీఐ వెంకటేశ్వరరావు శనివారం రాత్రి నోటీసులు అందించారు. ఈ యాత్రకు అనుమతి లేనందున గృహనిర్బంధం చేస్తున్నామని తెలిపారు. నిర్బంధంలో ఉన్న రామకృష్ణ ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం పరిరక్షణయాత్ర మొదలుపెడితే పోలీసులు గృహనిర్బంధం చేయడం దారుణమన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోలవరం ప్రాజెక్టును సందర్శించి తీరతామన్నారు. రామకృష్ణకు మద్దతు తెలపడానికి అక్కడికి వచ్చిన టీడీపీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలవరానికి పట్టిన గ్రహణం అని, రాష్ట్రంలో శకుని పాత్ర పోషిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజుకు పైరవీలు చేయడం తప్ప ప్రాజెక్టుల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు బుద్ధిలేదని, ఇప్పటికే రెండుసార్లు కోర్టు మెట్లు ఎక్కినా ఇంకా జ్ఞానం రాలేదని పేర్కొన్నారు.  

సీపీఐ నాయకులను విడుదల చేయాలి: చంద్రబాబు 
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన సీపీఐ నాయకుల నిర్బంధాలను ఖండిస్తున్నట్లు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏమైనా నిషిద్ధ ప్రాంతమా, పోలవరం వద్దకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాఘవమ్మ భర్త కృష్ణయ్యయాదవ్‌పైన, వీరాస్వామియాదవ్‌పైన కత్తులతో దాడిచేయడాన్ని ఖండిస్తున్నట్లు మరో ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబసభ్యులకు ఆయన ఆదివారం ఫోన్‌చేసి పరామర్శించారు.  

మరిన్ని వార్తలు