అన్నాడీఎంకే ఆఫీస్‌లోకి వెళ్లేందుకు పన్నీరు ప్రయత్నాలు.. మళ్లీ టెన్షన్‌

10 Sep, 2022 10:19 IST|Sakshi
అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పోలీసుల భద్రత 

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే కార్యాలయంలోకి అడుగు పెట్టేందుకు పన్నీరు సెల్వం ప్రయత్నాలు చేశారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఆయన మద్దతుదారులు చొచ్చుకెళ్లవచ్చన్న సమాచాంతో భద్రతను పెంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళతో పన్నీరు మద్దతుదారుడు వైద్యలింగం శుక్రవారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకేలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి కోర్టు ఆమోద ముద్ర వేయడంతో పళనిస్వామి పార్టీ వ్యవహారాల్లో దూకుడు పెంచారు.

పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా గురువారం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో అడుగు పెట్టారు. పార్టీ నేతలతో సమావేశాలు, బలోపేతం, సర్వ సభ్య సమావేశంతో పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శి పదవి చేజిక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టారు. పళనిస్వామికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  తాత్కాలిక బా«ధ్యతలతో తిరుమల శ్రీవారి దర్శనానికి పళనిస్వామి బయలుదేరి వెళ్లారు.  అదే సమయంలో తానేమి తక్కువ తిన్నానా..? అన్నట్టు పన్నీరు సెల్వం సైతం పావులు కదుపుతున్నారు.   

చిన్నమ్మతో భేటీ. 
అన్నాడీఎంకే వివాదాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళ సైతం రాజకీయంగా దూకుడు పెంచారు. శుక్రవారం తంజావూరులో ఆమె పర్యటించారు. ఆమెను పన్నీరు సెల్వం మద్దతుదారుడు, ఎమ్మెల్యే వైద్యలింగం కలిశారు. ఆమెతో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇప్పటికే చిన్నమ్మను కలిసేందుకు పన్నీరు సైతం ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఐకమత్యంగా ఉందామని చిన్నమ్మ పిలుపునిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత నెలకొంది.  

నేను సైతం.. 
అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ హోదాలో పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు పన్నీరు సెల్వం సిద్ధమవుతున్నారు. గతంలో చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో ఈసారి ముందుగానే పోలీసు భద్రత కోరే పనిలో పడ్డారు. తమకు భద్రత కల్పించాలని పన్నీరుసెల్వం మద్దతు నేత జేసీడీ ప్రభాకరన్‌ చెన్నై పోలీసులకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు.

అయితే, ఆయన విజ్ఞప్తిని పోలీసులు తోసిపుచ్చారు. అన్నాడీఎంకే కార్యాలయం వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా, అక్కడే తేల్చుకోవాలని సూచించారు. పోలీసుల అనుమతి నిరాకరణతో పార్టీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు పన్నీరు మద్దతుదారులు ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. దీంతో  పోలీసులు అప్రమత్తం అయ్యారు. కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. ఆ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  ఇదిలా ఉండగా శుక్రవారం పన్నీరు సెల్వం శ్రీవిల్లిపుత్తూరు అండాల్‌ అమ్మవారిని, వనపేచ్చి అమ్మన్‌ ఆలయాల్లో పూజలు నిర్వహించడం గమనార్హం. 

మరిన్ని వార్తలు