Video: కొత్త సచివాలయానికి రేవంత్ రెడ్డి.. కిలోమీటర్‌ దూరంలోనే అడ్డుకున్న పోలీసులు..

1 May, 2023 17:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన సచివాలయంకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఓఆర్ఆర్ టెండర్లపై ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా.. విషయం తెలుసుకున్న పోలీసులు కిలోమీటర్‌ దూరంలోనే సెక్రటేరియట్ సమీపంలోని టెలిఫోన్ భవన్ దగ్గర అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అంతేగాక సెక్రటేరియేట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి విజిటర్స్ గేటును మూసేశారు. 

కాగా  ఔటర్‌ రింగ్‌ రోడ్డు లీజు అంశంపై ఫిర్యాదు చేసేందుకు రేవంత్‌ రెడ్డి.. స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు. అనుమతిఅరవింద్ కుమార్ లేకపోవడంతో సచివాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందుకే రేవంత్‌రెడ్డిని టెలిఫోన్ భవన్‌ వద్దే అడ్డుకున్నారు. చివరకు ఆయన వెళ్లాల్సిన డిపార్ట్‌మెంట్ కొత్త భవనంలో లేదంటూ పోలీసులు ఆయన వాహనాన్ని మాసబ్ ట్యాంక్‌లోని అడ్మినిస్ట్రేషన్ భవన్‌కు తరలించారు.
చదవండి: ఎమ్మెల్సీ కవితపై ఈడీ కీలక అభియోగాలు.. తెరపైకి భర్త అనిల్ పేరు..

పోలీసుల తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక ఎంపీగా సచివాలయానికి వెళ్తే పోలీసులకు అభ్యంతరమేంటి? అని మండిపడ్డారు. ఎంపీని సచివాలయానికి వెళ్లకుండా రోడ్డుపైనే అడ్డుకోవడం, అప్రజాస్వామికం, దుర్మార్గమన్నారు. నడిరోడ్డుమీదే కారులోంచి డీజీపీతో ఫోన్‌లో మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ప్రకారం ఫిర్యాదు అందించడానికి సచివాలయం వెళ్తున్నానని, స్పెషల్‌ సెఎస్‌ లేకుంటే సంబంధిత శాఖలో ఏ అధికారినైనా కలిసి పేపర్‌ అంస్తానని అందిస్తానని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియాతో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్నటి నుంచే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగుతుందని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చి.. 24గంటలు తిరక్కముందే మరిచారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదు. టోల్‌కు సంబంధించి టేండర్ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీల వివరాలు ఆర్టీఐ ద్వారా అడిగేందుకు వెళ్లా. కానీ పోలీసులు చుట్టుముట్టి నన్ను అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్‌ను  ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్లపై విచారణ చేయిస్తాం. ఇందులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు.’ అని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు