బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల వార్‌.. నిప్పురాజేసిన ఈటల కామెంట్స్‌

22 Apr, 2023 16:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఒకరిపై ఒకరు సవాల్‌ విసురుకుంటున్నారు. కాగా, మునుగోడు ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్‌కు రూ. 25కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపణలు చేశారు. దీంతో, ఈటల తన ఆరోపణలు నిరూపించుకోవాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రమాణానికి రేవంత్‌ సిద్దమయ్యారు. కాగా, భాగ్యలక్ష్మి ఆలయానికి ఈటల రావాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. 

ఈ నేపథ్యంలో బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. తాజాగా డీకే అరుణ మాట్లాడుతూ.. ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్‌ ప్రమాణం చేస్తారా?. ఈటల రాజేందర్‌ చెప్పింది నూటికి నూరు శాతం నిజం. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ సహకరించింది. దుబ్బాక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటైన మాజ నిజం కాదా? వాస్తవం చెబితే రేవంత్‌కు ఎందకంత ఉలికిపాటు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్.. భాగ్య‌ల‌క్ష్మి గుడికి రావొద్దని ఫైర్‌ అయ్యారు. రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ గ‌త చ‌రిత్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. ప‌బ్లిక్‌లో రేవంత్‌కు బ్లాక్ మెయిల‌ర్ అనే పేరుంది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ప‌ద‌వుల‌ను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్న రేవంత్ ఇప్పుడు భాగ్య‌ల‌క్ష్మి గుడి వ‌ద్ద ప్ర‌మాణాలంటే న‌మ్మేదెవ‌రు?. లెక్క‌లేన‌న్ని త‌ప్పుడు ప‌నులు చేస్తున్న రేవంత్ భాగ్య‌ల‌క్షి గుడిలో అడుగు పెడితే, ఆ దేవాల‌యం అప‌విత్రం అవుతుంద‌నేది భ‌క్తుల భావ‌న‌. ఈటల రాజేందర్, నేను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారామే కానీ నీ మాదిరిగా ఒక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలో చేరలేదని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హైక‌మాండ్ పెద్దలకు డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుకున్నాడు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత‌తో కలిసి వ్యాపార లావాదేవీలు చేసింది వాస్త‌వం కాదా?. ఆమెతో నీకు వ్యాపార‌ భాగస్వామ్యం లేదా, ఓటుకు నోటు కేసులో ల‌క్ష‌ల రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌ల‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లిన చరిత్ర రేవంత్‌ది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు, బీజేపీ నేతల ఆరోపణలపై కాంగ్రెస్‌ నేత పాల్వాయి స్రవంతి స్పందించారు. తాజాగా స్రవంతి మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ రూ.25 కోట్లు ఇస్తే ఏం చేస్తున్నారు?. బీజేపీలోకి చేరికలు లేకపోవడంతో ఈటల రాజేందర్‌ ఆవేదనలో ఉన్నారు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. 

మరిన్ని వార్తలు