కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌లో కోల్డ్‌ వార్‌.. మంత్రి టార్గెట్‌గా ఆడియో లీక్‌ కలకలం!

10 Sep, 2022 15:48 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ రాజకీయాలు బయటకు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌, ఆయన కుటుంబాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి.

ఈ మేరకు గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. సదరు లేఖలో మాజీ మేయర్‌ కుటుంబం బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, మంత్రిపై రవీందర్‌ సింగ్‌ అల్లుడు మాట్లాడిన ఆడియో లీక్‌ కలకలం సృష్టించింది. ఇక, ఆడియోలో టీఆర్‌ఎస్‌ మంత్రి, కలెక్టర్ గురించి మాట్లాడినట్టు పార్టీ కార్యకర్తలు గుర్తించారు. 

ఈ సందర్భంగా పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ అల్లుడే సమస్యలు సృష్టించి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులను పార్టీలో కొనసాగించరాదని సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ను కోరారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణ సీఎం బీహార్‌ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ కూడా వెళ్లడం విశేషం.  

ఇది కూడా చదవండి: ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం

మరిన్ని వార్తలు