ఆధిపత్య పోరు.. కారు పార్టీలో కలకలం

18 Jan, 2021 20:14 IST|Sakshi

తీవ్ర దుమారం రేపుతున్న పొంగులేటి వ్యాఖ్యలు

తుమ్మలతో మంత్రి అజయ్‌, ఎంపీ నామా భేటీ

సాక్షి, హైదరాబాద్‌ : ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో రాజకీయ పరిణామాలు షర వేగంగా మారుతున్నాయి. ఆదివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు జిల్లా టీఆర్‌ఎస్‌లోనే కాకుండా రాష్ట వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయి. పార్టీ అధిష్టానం సైతం పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమచారం. తన కార్యక్రమాలకు వస్తున్న ప్రజా ప్రతినిధులపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థి వర్గాన్ని ఉద్దేశించి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచిది కాదని, తాను ప్రజాప్రతినిధి నీ కాదని ఎవరి పర్మిషన్ తీసుకోని రావాల్సిన అవసరం నాకు లేదనీ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. (సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి)

ఇలాంటి సమయంలో హడావుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపెట మండలం గండుగుల పల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామ నాగేశ్వర్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ హుటాహుటిన భేటీ కావడం పార్టీలో మరో చర్చ కు తెరలేపింది. అసలు  ఖమ్మం టీఆర్‌ఎస్‌లో  ఏం జరుగుతుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. స్థానిక పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు తుమ్మలతో భేటీ అయ్యారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పెద్ద  ఎత్తున ప్రచారం నడుస్తోంది. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు తొలి నుంచి వివాదంగా మారిన విషయం తెలిసిందే. తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ ఆ మధ్య తుమ్మల చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. మరోవైపు పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మలపై పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్‌ రెడ్డికి తాను అండగా ఉంటానంటూ మంత్రి అజయ్‌ చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

పదవులు ఎవరి సొత్తు కాదు..
‘కొందరు మూడేళ్లు, కొందరు నాలుగేళ్లు.. మరికొందరు ఐదేళ్లు.. మంచిగా పరిపాలిస్తే తిరిగి పదవి దక్కుతుంది. అంతే తప్ప పదవులు ఎవడబ్బ సొత్తు కాదు’అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలే మన సొత్తు అని ప్రజల అభిమానమే నాకు పెద్ద పదవి అని ఆయన వివరించారు. ఆదివారం మండలంలోని జయలక్ష్మిపురం, చిన్నమల్లెల, కుంచపర్తి గ్రామాల్లో పర్యటించి పలు ప్రైవేట్‌ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. పలు కార్యక్రమాల్లో ఒకే పార్టీలో ఉంటూ కక్ష సాధిస్తున్నారని అభిమానులు పొంగులేటి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాలు చేయడం సంస్కారం కాదని, నష్టపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని.. కష్టపెట్టిన వాడు ఒక్కడే వడ్డీతో సహా ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. పదవులు వచ్చేటప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగవని, పోయేటప్పుడు ఎక్కడా ఉన్నా పోతాయని, ప్రజాభిమానమే శాశ్వతమని చెప్పారు. అధికారం ఉంది కదా అని పొంగులేటి, దయానంద్, మువ్వా.. కార్యక్రమాలకు వెళ్లొద్దని ఎన్ని ఆంక్షలు పెట్టినా.. అభిమానం ఉన్న దగ్గరికే వస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు