సీఎం అభ్యర్థిపై పేచీ.. రజనీతో అమిత్‌ షా భేటీ!

7 Jan, 2021 08:20 IST|Sakshi

14న అమిత్‌షా చెన్నైకి రాక

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య మిత్రభేద రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై రెండు పార్టీల నడుమ పొలిటకల్‌ వార్‌ నడుస్తుండగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈనెల 14న చెన్నైకి వస్తున్నారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని రాబోయే ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు రెండు నెలల క్రితమే అన్నాడీఎంకే ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్రశాఖ వ్యతిరేకిస్తోంది. ఇటీవల చెన్నైకి వచ్చిన కేంద్రమంత్రులు సైతం ఎడపాడి పేరును అంగీకరించలేదు. అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ ఉందని ఆన్నాడీఎంకే నేతలు ఒకవైపు, ఎన్‌డీఏ కూటమిలో అన్నాడీఎంకే ఉందని బీజేపీ నేతలు మరోవైపు వాదిస్తున్నారు. ఎన్‌డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదీ తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షులు మురుగన్‌ బహిరంగంగా ప్రకటించారు. (‘అమ్మ’కు వారసులు లేరా?)

ఎడపాడి అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తేనే కూటమిలోకి రండి లేకుంటే పొండి అన్నట్లుగా అన్నాడీఎంకే వ్యవహరిస్తోంది. కూటమిలో ఇలాంటి మిత్రబేధ పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో గత ఏడాది నవంబర్‌ 21న అమిత్‌షా చెన్నైకి వచ్చారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ కొనసాగుతుందని పార్టీ కన్వీనర్‌ పన్నీర్‌సెల్వం ఆనాడు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలు కేటాయించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. బీజేపీకే 60 సీట్లు కేటాయిస్తే కూటమిలోని పీఎంకే, డీఎండీకేలు సైతం ఎక్కువ సీట్లను డిమాండ్‌ చేసే పరిస్థితులు తలెత్తుతాయని వాదించి 34 సీట్లకు అన్నాడీఎంకే అంగీకరించినట్లు తెలుస్తోంది. 60 సీట్లు కేటాయిస్తే తాము పుదియనీది కట్చి, తమిళ మక్కల్‌ మున్నేట్ర కళగం తదితర చిన్న పార్టీలకు సీట్ల సర్దుబాటు చేస్తామని బీజేపీ చెబుతోంది. దీనికి అన్నాడీఎంకే సమ్మతించడం లేదు. ఇదే అదునుగా 40 సీట్లు కోరాలని పీఎంకే నిర్ణయించుకుంది. వన్నియర్‌ సామాజిక వర్గ మద్దతు బలంగా ఉన్న పీఎంకేకు గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఉంది. రాజ్యసభ సీటు ఒప్పందంపైనే గడిచిన లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే చేరింది. ఒప్పందం ప్రకారం పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్‌ను రాజ్యసభకు పంపింది. (తలైవా.. నువ్వు రావాల్సిందే)

రజనీ మద్దతు కోసం అమిత్‌ షా..
అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చి అధికసీట్లలో తమ అభ్యర్థులు గెలిస్తే ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పందం కుదుర్చుకోవాలని పీఎంకే భావిస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకేతో సీట్ల సంధి కుదరకుంటే డీఎంకే వైపు వెళ్లాలని పీఎంకే భావిస్తోంది. 14వ తేదీన జరగనున్న బీజేపీ – అన్నాడీఎంకే చర్చల కన్నా ముందే తమ డిమాండ్లను తెరపైకి తేవాలన్న ఉద్దేశంతో పీఎంకే ఈనెల 9వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలుండగా, బీజేపీకి 60, పీఎంకేకి 40 కేటాయిస్తే, అన్నాడీఎంకే సహా కూటమిలోని మిగిలిన రెండు మూడు పార్టీలకు మిగిలేది 134 మాత్రమే. నటుడు విజయకాంత్‌ నేతృత్వంలోని మరో మిత్రపక్ష పార్టీ డీఎండీకే సీట్లపై ఇంకా నోరువిప్పలేదు. ఇలా కూటమిలో ప్రధానపార్టీలు అన్నాడీఎంకే మెడపై వేలాడుతున్న కత్తిలా మారాయి. సీట్ల సర్దుబాటులో పట్టుదలలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై విభేదాలు నెలకొన్న తరుణంలో ఈనెల 14న అమిత్‌షా చెన్నై రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. అమిత్‌షా సమక్షంలో రెండు ప్రధాన సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నారు. ఈ పర్యటనలో నటుడు రజనీకాంత్‌ను సైతం అమిత్‌షా స్వయంగా కలిసి, మద్దతు కోరుతారని సమాచారం.

మరిన్ని వార్తలు