పట్టభద్రుల పోటీ... రసవత్తరం! 

4 Oct, 2020 03:12 IST|Sakshi

ప్రధాన పార్టీలతోపాటు ఈసారి బరిలోకి భారీగా స్వతంత్రులు 

నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ స్థానంలో హోరాహోరీ పోరుకు అవకాశం 

ప్రొ.కోదండరాం, ప్రొ.నాగేశ్వర్‌తోపాటు పలువురు పోటీకి ఆసక్తి 

సాక్షి, హైదరాబాద్‌: శాసన మండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పోటీ రసవత్తరంగా మారనుంది. హేమాహేమీలు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’తో పాటు ‘వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’లో గురువారం నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో పొలిటికల్‌ జోష్‌ మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓ వైపు ఓటరు నమోదుపై దృష్టి పెడుతూనే, అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నాయి. మండలి ‘నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌’స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మళ్లీ టీఆర్‌ఎస్‌ పక్షాన అవకాశం దక్కుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కు చెందిన జర్నలిస్టు పీవీ శ్రీనివాస్‌ వంటి వారు టికెట్‌ను ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌’స్థానం నుంచి హైదరాబాద్‌ మేయర్‌ రామ్మోహన్, గత ఎన్నికల్లో కొద్దిఓట్ల తేడాతో ఓడిన పీఎల్‌ శ్రీనివాస్, వికారాబాద్‌కు చెందిన విద్యార్థి నేత శుభప్రద్‌ పటేల్‌ కూడా టీఆర్‌ఎస్‌ టికెటు ఆశిస్తున్నారు. 

కాంగ్రెస్‌లోనూ పోటాపోటీ..! 
‘రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌ నగర్‌’ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎస్‌.సంపత్‌కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. ప్రైవేటు జూనియర్‌ కళాశాలల సంఘం నేత, విద్యావేత్త గౌరీసతీశ్‌ కూడా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను కలిశారు. విద్యాసంస్థల అధిపతి ఏవీఎన్‌ రెడ్డి, , టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ పోశాల వంటి వారు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌’స్థానం నుంచి టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఓయూ విద్యార్థి నేత కోటూరి మానవతారాయ్‌ పోటీ చేసే యోచనలో ఉన్నారు. 

మరోమారు బరిలోకి రాంచందర్‌రావు? 
‘రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌’పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం బీజేపీ నేత ఎన్‌.రాంచందర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్‌.రాంచందర్‌రావుతోపాటు బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్‌.మల్లారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’స్థానం నుంచి బీజేపీ నేతలు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పేరాల శేఖర్‌రావు తదతరులు బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. 

వరంగల్‌ బరిలో కోదండరాం 
‘వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం బరిలోకి దిగనున్నారు. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. ‘హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌’ నుంచి గతంలో రెండు పర్యాయాలు గెలుపొందిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మరోమారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరితోపాటు యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి, సూదగాని ట్రస్టు చైర్మన్‌ సూదగాని హరిశంకర్‌ గౌడ్‌ కూడా పట్టభద్రుల కోటా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.

>
మరిన్ని వార్తలు