ఎవరి లెక్కలు వారివే.. ఎవరి ధీమా వారిదే..

8 Mar, 2021 08:33 IST|Sakshi

పట్టభద్రుల ఓట్ల వేటలో రాజకీయ పక్షాలు బిజీబిజీ 

ఎవరి లెక్కలు వారివే... అందరిలోనూ గెలుపుపై ఆశలు

బోనస్‌ కోసం టీఆర్‌ఎస్, బీజేపీ యత్నాలు

అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కాంగ్రెస్‌...

చిన్న పార్టీలు, స్వతంత్రుల్లోనూ గెలుపుపై ధీమా

ప్రచారానికి మిగిలింది ఐదు రోజులే... ఈ నెల 14న పోలింగ్‌  

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో బిజీబిజీ అయ్యాయి. విజయంపై ధీమాతో ముందుకెళుతున్నాయి. హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్, నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌ పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న పోలింగ్‌ జరగనుంది. ఈ రెండింటిలోనూ గెలుపు తమదేననే స్థాయిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్‌ పార్టీలు ప్రచారపర్వంలో దూసుకెళుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్, బీజేపీలు సిట్టింగ్‌ స్థానాలను నిలబెట్టుకొని... మరో స్థానాన్ని బోనస్‌గా దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ కూడా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించి, మరో స్థానంలో అభ్యర్థిని నిలబెట్టిన వామపక్షాలు కూడా తమ అనుబంధ సంఘాల సహకారంతో మండలిలో ప్రాతినిధ్యం దక్కించుకునేందుకు శ్రమిస్తున్నాయి.  

అందరూ ఎన్నికల ప్రచారంలోనే..
మరో ఐదు రోజుల్లో (ఈనెల 12తో) ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాల నాయకులంతా క్షేత్రస్థాయిలో ఉండి పట్టభద్రుల ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు పట్టభద్రుల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశంతో ఆ పార్టీ నేతలంతా తమ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల గెలుపు కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన లాంటి అంశాలను పట్టభద్రుల దృష్టికి తీసుకెళుతున్నారు. న్యాయవాదులు, ఉద్యోగులు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ సంఘాలు, యాజమాన్య సంఘాలు, జర్నలిస్టులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు... ఇలా ఓటర్లందరినీ ఏదో రకంగా కలిసి ఓట్లను అభ్యర్థించే పనిలో పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ పక్షాన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ అభ్యర్థి రాములు నాయక్‌తో, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ అభ్యర్థి చిన్నారెడ్డితో కలిసి ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం భద్రాచలం నుంచి వినూత్నంగా సైకిల్‌పై ఎన్నికల ప్రచారయాత్ర మొదలుపెట్టారు. వీరికి తోడుగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నేతలంతా ఎన్నికల ప్రచారంలో గడుపుతున్నారు. ఊరూరా తిరుగుతూ ఓటర్లను కలిసి తమ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. బీజేపీ పక్షాన బండి సంజయ్, డి.కె.అరుణ, కిషన్‌రెడ్డిలు కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ అభ్యర్థులు రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిలను గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ ఫలితాలతో ఊపు మీదున్న కమలనాథులు అటు వరంగల్‌ నుంచి ఇటు పాలమూరు వరకు అన్ని జిల్లాలు చుట్టేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మంచి ఫలితం సాధించాలనే పట్టుదలతో దూసుకెళుతున్నారు. ఇక, నల్లగొండ నుంచి బరిలో ఉన్న సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డి ఇతర వామపక్షాలు, అనుబంధ సంఘాల సహకారంతో ఆ మూడు పార్టీలకు దీటుగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. వామపక్ష అనుబంధ సంఘాలయితే గ్రామ గ్రామాన తిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నాయి. వీరికి తోడు రెండు నియోజకవర్గాల నుంచి ప్రొఫెసర్లు ఎం.కోదండరాం, డాక్టర్‌ కె.నాగేశ్వర్‌లతో పాటు చెరుకు సుధాకర్, గాల్‌రెడ్డి హర్షవర్ధ్దన్‌రెడ్డి, సూదగాని హరిశంకర్‌గౌడ్, రాణీ రుద్రమ, గౌరీ సతీశ్‌ తదితరులు కూడా తమ శక్తినంతా ధారపోసి ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇచ్చే దిశలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం మీద 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
చదవండి:
విజిలెన్స్‌ పట్టించినా.. ఆర్టీసీ వదిలేసింది 
వెల్కటూరులో కొత్త రాతియుగం ఆనవాళ్లు 

 

మరిన్ని వార్తలు