మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు

2 Nov, 2022 01:32 IST|Sakshi

టీఆర్‌ఎస్‌అభ్యర్థికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల భారీ ర్యాలీలు

బీజేపీ నేతల బైక్‌ ర్యాలీలు.. కాంగ్రెస్‌ మహిళా గర్జన

అక్కడక్కడా దాడులు, ఘర్షణలతో నియోజకవర్గంలో ఉద్రిక్తత

ప్రచారం ముగియడంతో పంపకాలు, ప్రలోభాలకు తెరతీసిన పార్టీలు

డబ్బు, మద్యం పంపిణీ షురూ

రేపే ఉప ఎన్నిక ..6న కౌంటింగ్‌

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆరోపణలు .. ప్రత్యారోపణలు, వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు, వ్యక్తిగత విమర్శలు.. దాడులు, ప్రలోభాలు .. పంపకాలు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశాయి. ముఖ్య నేతలంతా నియోజకవర్గంలోనే మోహరించారు. సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో జోరుగా ప్రచారం కొనసాగించారు. ఇక ప్రచార పర్వం చివరిరోజు మంగళవారం మునుగోడు జనసంద్రాన్ని తలపించింది. నియోజకవర్గానికి పోటెత్తిన వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు.. ర్యాలీలు, రోడ్‌ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఎవరికి వారు తమ పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఒకటీ రెండుచోట్ల జరిగిన భౌతిక దాడులు, ఘర్షణలు పోలింగ్‌కు ముందు ఒకింత ఉద్రిక్తతకు తావిచ్చాయి. 
నియోజకవర్గంలోనే మకాం వేసి..

ఉప ఎన్నిక ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందన్న భావనతో అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. షెడ్యూల్‌ వెలువడక ముందే ప్రచారం ప్రారంభించిన పార్టీలు ఆ తర్వాత ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. స్థానిక నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు  నియోజకవర్గాన్ని వీడకుండా ఆయా పార్టీల అధిష్టానాలు చివరిరోజు వరకు కట్టడి చేశాయి. దీంతో నాయకులు ఏకంగా ఆయా గ్రామాల్లోనే గదులు అద్దెకు తీసుకుని ప్రచార వ్యూహాలకు పదును పెట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఉప్పు, నిప్పులా తలపడ్డాయి. అక్టోబర్‌ 26వ తేదీ రాత్రి బయటకు వచ్చిన ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం రాష్ట్రంలో మరింత రాజకీయ వేడిని రాజేసింది.

సంక్షేమ మంత్రం .. ఎదురుదాడి యత్నం
ప్రచార పర్వంలో అధికార టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో ముఖ్యంగా మునుగోడులో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావనతో పాటు, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, కుటుంబ పాలన వంటి ఆరోపణల ఎదురు దాడితో కాషాయ దళం కాక పుట్టించింది. ఇక బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒకటే అంటూ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు చేసింది.

హోరెత్తిన ప్రచారం
మంగళవారం చివరిరోజు కావడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు టి.హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని వేర్వేరు మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడులో కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు కలిసి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.

నాంపల్లి మండలంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, చండూరులో ఎర్రబెల్లి, చౌటుప్పల్‌లో శ్రీనివాస్‌గౌడ్, మలారెడ్డి ర్యాలీలకు నేతృత్వం వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నాంపల్లి నుంచి మర్రిగూడ మీదుగా చండూరు వరకు వేలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్‌తో పాటు పార్టీ నాయకులు ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, వెంకటస్వామి, సునీల్‌ బన్సల్‌ తదితరులంతా నియోజకవర్గంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్‌ మునుగోడులో మహిళా గర్జన నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రేణుకాచౌదరి, గీతారెడ్డి, సీతక్క తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు
ప్రచారం ముగియడంతో.. గురువారం జరిగే పోలింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. డబ్బు, మద్యం పంపిణీ మొదలుపెట్టాయి. ప్రధాన పార్టీలు ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇవ్వడంతో పాటు భారీయెత్తున మద్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. పోలింగ్‌కు ముందు బుధవారం ఒక్కరోజే మిగిలి ఉండటంతో అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేసే ప్రయత్నాల్లో పార్టీలు నిమగ్నమయ్యాయి.

డబ్బు, మద్యం పంపిణీతో పాటు కుల సమీకరణలకు ప్రాధాన్యతనిస్తూ తమవైపు తిప్పుకోవడంపై దృష్టి సారించాయి. ప్రచార గడువు ముగియడంతో నియోజకవర్గాన్ని విడిచిపెట్టిన స్థానికేతర నేతలు ఆ చుట్టుపక్కలే మకాం వేశారు. నియోజకవర్గం బయట ఉన్న ఓటర్లను గురువారం పోలింగ్‌ కేంద్రాలకు రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 47 మంది ఉప ఎన్నిక బరిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
చదవండి: ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్‌

మరిన్ని వార్తలు