ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’

31 Aug, 2021 08:39 IST|Sakshi

టీఆర్‌ఎస్, వైఎస్సార్‌టీపీ జెండా గద్దెల కూల్చివేత

కూల్చివేసిన సర్పంచ్‌

ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌టీపీ నాయకులు

రామడుగు (చొప్పదండి): కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్‌రావుపేట ప్రధాన చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా గద్దెతో పాటు వారం క్రితం నిర్మించిన వైఎస్సార్‌టీపీ జెండా గద్దెను సోమవారం స్థానిక సర్పంచ్, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న పంచాయతీ సిబ్బందితో తొలగించారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై వివేక్, ట్రెయినీ ఎస్సై నరేశ్, సిబ్బంది గోపాల్‌రావుపేటకు చేరుకొని టీఆర్‌ఎస్‌ నాయకులతోపాటు సర్పంచ్‌కు నచ్చ జెప్పి పంపించారు. (చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం)

అనంతరం కూల్చిన స్థలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు గద్దె నిర్మించి జెండా ఎగురవేశారు. కాగా ఘటనపై వైఎస్సార్‌టీపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కో-కన్వీనర్‌ తడగొండ సత్యరాజ్‌వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ జెండా గద్దె కూల్చివేతపై గోపాల్‌రావుపేట సర్పంచ్‌పై కరీంనగర్‌ సీపీకి ఫిర్యాదు చేస్తామని జితేందర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌టీపీ జెండాను కూల్చివేసిన సర్పంచ్‌ను తక్షణం అధికారులు సస్పెండ్‌ చేయాలని సత్యరాజ్‌వర్మ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గద్దె కూల్చివేత, సర్పంచ్‌ అవినీతిపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు గ్రామంలో వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

చదవండి: కాపురానికి రావడం లేదని సెల్‌టవర్‌ ఎక్కి భర్త హల్‌చల్‌

మరిన్ని వార్తలు