కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లోకి.. కేసీఆర్‌ ప్రకటనే అసలు సమస్య.. మాజీ ఎమ్మెల్యే దారేటు?

9 Dec, 2022 21:23 IST|Sakshi

గతంలో మాదిరిగా ఈసారి కూడా సిటింగ్‌లకే సీట్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనేక స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గతం నుంచీ అక్కడ గులాబీ పార్టీకి సేవ చేస్తున్నవారి పరిస్థితి ఏంటి? గతం నుంచి సీటిస్తామంటూ హామీ పొందినవారి సంగతేంటి? ఇటువంటి వారంతా సీట్ల కోసం ఏం చేయబోతున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేతలు ఏమంటున్నారు? 

నకిరేకల్‌లో రసవత్తరం
ఈసారి‌ టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత ఇచ్చిన భరోసా వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ పట్టరాని సంతోషం కలిగించింది. కొందరిని మాత్రం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. సిట్టింగులకే సీట్లు అంటే తమ పరిస్థితి ఏంటని‌ పార్టీలో ఉన్న ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు.

ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలున్న స్థానాల్లో ఈ ఆందోళనలు కాస్త ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది‌‌. అలాంటి నియోజకవర్గాల్లో నల్లగొండ జిల్లా నకిరేకల్ కూడా ఒకటి. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వేముల‌ వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ ఫిరాయింపుతోనే అసలు సమస్య మొదలైంది‌. 

 కారు నడిపేది నేనే..!
ప్రత్యర్థులుగా పోటీ చేసి గెలిచిన, ఓడిన నాయకులు ఇద్దరు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరు కూడా వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కానీ అధినేత మాత్రం సిట్టింగులకే సీట్లు అని ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులతో సమావేశమైన‌ సందర్భంలో కీలక‌ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పోటీ చేస్తానని అందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని‌ పిలుపునిచ్చారు. కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొందామని... మన‌ మౌనం పిరికితనం కాదని గోడకు వేలాడ దీసిన‌ తుపాకీ లాంటిదని ఘాటు కామెంట్స్‌ చేశారు. ఎంత తొక్కాలని చూస్తే బంతిలా అంత పైకి ఎగురుదామని వీరేశం మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఖచ్చితంగా పోటీలో‌ ఉండటం ఖాయం అని తెలుస్తోంది. 

కమలం కొత్త వ్యూహం
అయితే వీరేశం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగినా.. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన వారిని ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయించి సొంత పార్టీకి ధీటుగా కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. అందువల్ల ఆయన కూడా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు మీద పోటీ చేస్తారా? లేక‌ ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే వేముల వీరేశంపై ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ కూడా ఓ కన్నేసి ఉంచాయి‌.‌ కాని ఇప్పటికే చెరుకు సుధాకర్ కాంగ్రెస్‌లో చేరి ఆయన భార్య లక్ష్మీని నకిరేకల్ నుంచి బరిలో దింపేందుకు ప్లాన్ చేశారు‌. ఇలాంటి‌ సమయంలో వేముల కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అనుమానమే.  అదే సమయంలో బీజేపీలో చేరడానికి సిద్ధాంత వైరం అడ్డుగా ఉంది. వీరేశం మాజీ మావోయిస్టు. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరుతారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

టికెట్‌ వచ్చినా రాకున్నా.. బరిలో ఉంటా.!
వీరేశానికి టీఆర్ఎస్ టికెట్ రాకున్నా పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన అనుచరులు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేయవద్దనే సూచిస్తున్నారు. పలు సంస్థలు చేసిన సర్వేల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కంటే తనకే అనుకూలత ఎక్కువ ఉందని వీరేశం చెబుతున్నట్లు తెలుస్తోంది‌. ఈ సర్వేలతో పాటు టీఆర్ఎస్ చేయించిన సర్వేలో కూడా సానుకూలత తనకే ఉందని వీరేశం అంటున్నారని టాక్. తనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతుందా అన్న నమ్మకం ఆయనకు ఏమూలనో ఉందని అంటున్నారు. నకిరేకల్‌లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్య మధ్య మరోసారి రసవత్తర పోరు జరగనుందని అర్థం అవుతోంది.

పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు