బాదల్‌ రాజీనామా వెనుక అసలు వ్యూహం

18 Sep, 2020 13:29 IST|Sakshi

రాజీమానా.. రాజకీయ ఎత్తుగడ

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయేలో కీలక మిత్రపక్షంగా ఉన్న శిరోమణీ అకాలీదళ్‌ ఎంపీ హర్‌ సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ కేంద్రమంత్రి వర్గం నుంచి వైదొలగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుల (వ్యవసాయ)కు వ్యతిరేకంగా రాజీనామా సమర్పిస్తున్నట్లు బాదల్‌ ప్రకటించారు. అంతకుముందు పార్లమెంట్‌లో ప్రసంగించిన ఆమె భర్త అకాలీదళ్‌ చీఫ్‌  సుఖ్బీర్‌ సింగ్ బాదల్‌ సైతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ కోర్‌ కమిటీలో చర్చించి ఎన్డీయేలో కొనసాగాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు బాదల్‌ అనుహ్య నిర్ణయంపై జాతీయ రాజకీయాల్లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి పదవికి రాజీనామా అంశాన్ని రాజకీయ ఎత్తుగడగా కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు విశ్లేషిస్తున్నాయి. గతకొంత కాలంగా బీజేపీ, శిరోమణీ అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) భేదాభిప్రాయాలు వస్తున్నాయని, అవి తాజాగా తారాస్థాయికి చేరాయని అభిప్రాయపడుతున్నారు. (బీజేపీ షాక్‌: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!)

వారి అంచనా ప్రకారం.. మరో 18 నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ-ఎస్‌ఏడీ మధ్య సీట్ల పంపకాలపై ఇదివరకే చర్చలు ప్రారంభం అయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను బీజేపీ 23, ఎస్‌ఏడీ 94 స్థానాల్లో బరిలోకి దిగాయి. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే బాదల్‌ నాయకత్వంపై బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగారు. ఆయనతో పొత్తు కారణంగానే బీజేపీకి తీవ్ర నష్టం జరిగిందని, తమకున్న సాంప్రదాయ  ఓటు బ్యాంకును సైతం  కోల్పోవల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. (కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా)

ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో 50-50 ఫార్మాలాను బీజేపీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. 50శాతం సీట్లు ఇస్తేనే పొత్తు కుదురుతుందని  ఇదివరకే తేల్చిచెప్పారు. స్థానిక బీజేపీ నేతల తీరు అకాలీదళ్‌ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇక వివాదాస్పద చట్టాలైనా సీఏఏ, ఎన్‌ఆర్సీపై కూడా సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్‌ వేదికగా నిరసన స్వరం వినిపించారు. తాజా బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ నేతలకు విప్‌సైతం జారీచేశారు.

అనంతరం ఓ అడుగు ముందుకేసి ఆ పార్టీ నుంచి చోటుదక్కించుకున్న ఏకైక కేంద్రమంత్రి, సుఖ్బీర్‌ సింగ్‌ భార్య హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ చేత రాజీనామా చేయించారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుండటం తమ మద్దతుదారుల్లో అత్యధికులు రైతులే కావడంతో, బిల్లులను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎస్‌ఏడీకి నెలకొన్నది. ఎన్‌డీఏలో ఎస్‌ఏడీ కొనసాగేది, లేదని త్వరలో నిర్ణయిస్తామని సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ తెలిపారు. అయితే ఇదంతా సుఖ్బీర్‌ సింగ్‌ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతుల మెప్పు కోసమే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తాము ఇక ఎన్డీయే కూటమిలో సాగేదిలేదని అకాలీదళ్‌ నేతలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. కాగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన శిరోమణీ అకాలీదళ్‌ బీజేపీకి తొలినుంచీ మిత్రపక్షంగానే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు