టీడీపీ నేతలకు కొత్త టెన్షన్‌.. రూటు మార్చిన పచ్చ పార్టీ లీడర్లు!

9 Jun, 2023 15:49 IST|Sakshi

అభివృద్ధి అనేది టీడీపీ ఎజెండాలో లేని విషయం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అడ్డుకోవడమే పచ్చ పార్టీ నేతల పని. అన్ని ఆటంకాలు అధిగమించి పనులు సాగుతుంటే మాత్రం ఆ ఘనత తమదే అని డప్పు కొట్టుకోవడంలో కూడా టీడీపీ నేతలు ముందుంటారు. అనంతపురం జిల్లాలోని ఒక టీడీపీ నేత డప్పు ఎలా కొట్టుకుంటున్నారంటే..

అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ ఛైర్మన్ వైకుంఠం ప్రభాకర చౌదరి అభివృద్ధి అంటే నేనే అని డప్పు కొట్టుకోవడంలో ఆరితేరిపోయారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ తరపున జేసీ దివాకరరెడ్డి ఎంపీగా, ప్రభాకర చౌదరి టౌన్ ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతపురం టౌన్లో ఏ పని చేయాలన్నా ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదిరేది కాదు. పట్టణంలో ఏ పనీ చేయకుండా, ఇద్దరు గొడవ పడటంతోనే ఐదేళ్ళు ముగిసిపోయింది. అందుకే టీడీపీ పాలనలో అనంతపురం పట్టణం అభివృద్ధి జరగకపోగా.. మరింత వెనుకపడిపోయింది. గత ఎన్నికల్లో ప్రభాకరచౌదరి మీద విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నగరం అభివృద్ధి పథంలో సాగుతోంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనంతపురం నగర అభివృద్ధికి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అనంతపురం అభివృద్ధికి 650 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కేంద్రంతో మాట్లాడి అనంతపురం నగరం మీదుగా ఓ జాతీయ రహదారిని మంజూరు చేయించారు. అనంతపురం నగరంలో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. హైవే పనులు కూడా 80 శాతం పూర్తి కావటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరం అభివృద్ధి అంతా వైఎస్ఆర్‌సీపీ ఖాతాలోకి వెళ్ళడం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి నచ్చడంలేదు. ఇలాగే సాగితే నగరంలో పచ్చ పార్టీకి ఉనికి ఉండదని భయపడి.. అభివృద్ధిని వక్రీకరించడం ప్రారంభించారు.

అనంతపురం నగరంలో నిర్మాణమవుతున్న 42, 44 జాతీయ రహదారుల లింక్ హైవే టీడీపీ హయాంలోనే మంజూరు అయిందని.. పనులు ప్రారంభం అయ్యే లోగా ప్రభుత్వం మారిపోయిందంటూ  ప్రభాకర్ చౌదరి గోబెల్స్ ప్రచారం ప్రారంభించారు. వాస్తవానికి జాతీయ రహదారిగా ఉన్న అనంతపురం సుభాష్ రోడ్డును స్టేట్ హైవేగా మారుస్తూ టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయాలకు నేషనల్ హైవే నిబంధనలు అడ్డురావటంతో నగర అభివృద్ధి గురించి ఆలోచించకుండా టీడీపీ నేతలు హైవే హోదానే తగ్గించేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరి దీనికి ఏ మాత్రం అడ్డుచెప్పలేదు. మద్యం అమ్మకాల కోసం చంద్రబాబు అనంతపురం నగరంలోని జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చేశారు.

చంద్రబాబు హయాంలో జరిగిన తప్పును గుర్తించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో  అనంతపురం ప్రధాన రహదారిని తిరిగి నేషనల్ హైవే జాబితాలో చేర్చాలని సీఎం జగన్  కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ దాకా కొత్తగా నాలుగు లేన్ల హైవే నిర్మించాలని.. అనంతపురం క్లాక్ టవర్ దగ్గరున్న పాత బ్రిడ్జి స్థానంలో కొత్త ఫ్లై ఓవర్ నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో 310 కోట్లతో జాతీయ రహదారి మంజూరు అయింది. 

హైవే పనులు జరక్కుండా అడుగడుగునా అడ్డు పడిన టీడీపీ నేతలు.. అభివృద్ధి పనులు చివరి దశకు చేరటంతో రూటు మార్చారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పనులన్నీ పూర్తి అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుందన్న భయం టీడీపీ నేతల్ని వెంటాడుతోంది. పచ్చ పార్టీ రాజకీయ డ్రామాలు నమ్మవద్దని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రజలకు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: టీడీపీలో సీటు కోసం నానాపాట్లు.. సీనియర్‌ నేతకు సర్దుబాటు అవుతుందా?

మరిన్ని వార్తలు