తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌.. రాహుల్‌, ఖర్గే ఏం చెప్పారు?

29 Jun, 2023 07:35 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని స్థానాల్లో పోటీ చేస్తామనడంపై కాంగ్రెస్‌ పార్టీ అలర్ట్‌ 

తమకు సంప్రదాయకంగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చే కుట్ర అనే అనుమానం

దీనిని ఎదుర్కొనే వ్యూహాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నేతలకు అధిష్టానం సూచన 

సుమారు 49 స్థానాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం 

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో తెలంగాణలో బలంగా ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని మజ్లిస్‌ (ఎంఐఎం) పార్టీ చేసిన ప్రకటనపై ఇప్పుడు కాంగ్రెస్‌ దృష్టిపెట్టింది. కాంగ్రెస్‌కు సంప్రదాయకంగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చే కుట్రలో భాగంగానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని.. దీనివల్ల కాంగ్రెస్‌పై పడే ప్రభావం ఎలా ఉంటుంది, దీనిని ఎలా ఎదుర్కోవాలన్న విషయాలపై ఆలోచన చేస్తోంది. ఈ మేరకు వ్యూహాలను సిద్ధం చేయాలని రాష్ట్ర నేతలకు  రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించినట్టు సమాచారం. ముస్లిం ఓటర్లు 15% నుంచి 40% వరకున్న 49 నియోజకవర్గాల పరిధిలో కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. 

ఎంఐఎంను అడ్డుకోవాల్సిందే.. 
రాష్ట్రంలో సుమారు 44 లక్షల ముస్లిం జనాభా ఉంది. ఇందులో 20 వేలకన్నా ఎక్కువ ముస్లిం ఓటర్లున్న నియోజకవర్గాలు 49 ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం ఎంఐఎం ఎమ్మెల్యేలున్న స్థానాలతోపాటు కొత్తగా జహీరాబాద్, సంగారెడ్డి, బోధన్, నిజామాబాద్‌ అర్బన్, నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్, కరీంనగర్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, గోషామహల్, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, వరంగల్‌ ఈస్ట్, మహబూబ్‌నగర్, బాన్సువాడ, ఎల్లారెడ్డిలలో మజ్లిస్‌ పోటీచేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేసినట్టు తెలిసింది. ఇందులో మెజార్టీ స్థానాలు ప్రస్తుత సర్వేల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవేనని.. కేవలం ముస్లిం ఓటు బ్యాంకును చీల్చేందుకే ఎంఐఎం ఆ స్థానాల్లో పోటీచేసే అవకాశం ఉందని భావిస్తున్నట్టు సమాచారం. ఆయా స్థానాల్లో ఎంఐఎం ప్రాబల్యాన్ని అడ్డుకోకుంటే.. కాంగ్రెస్‌ గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. 

కర్ణాటకలో కలసిరావడంతోనే.. 
కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్‌ వైపు మళ్లడం విజయానికి బాటలు వేసిందని.. బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన 4% రిజర్వేషన్‌ కోటాను పునరుద్ధరిస్తామన్న ప్రకటన కాంగ్రెస్‌కు కలసి వచి్చందని నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హామీఇచ్చి అమలు చేయలేకపోయిన ముస్లింలకు 12% రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు తెలిసింది. ముస్లింలలో ప్రభావం చూపే వ్యక్తులతో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్‌ వైపు తిప్పుకోవాలని అధిష్టానం సూచించినట్టు సమాచారం.   

ఇది కూడా చదవండి: ఆ మార్పుల ప్రచారం కేసీఆర్‌ కుట్ర 

మరిన్ని వార్తలు