Nizamabad Urban:ఏడాదికి ముందే బలప్రదర్శనలు.. సిట్టింగ్‌ ఉన్నప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే హడావుడి

22 Nov, 2022 12:47 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే నిజామాబాద్‌లో నాయకుల బలప్రదర్శనలు షురూ అయ్యాయి. తాజాగా ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య నువ్వా నేనా అనేవిధంగా మాటలయుద్ధం ముదిరింది. ఈ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వరకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య వాడి వేడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ స్థానంలో మరోరకమైన రాజకీయ వాతావరణం ఏర్పడింది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు తాపత్రయపడుతున్నారు.

టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగులకు మళ్లీ టిక్కెట్లు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ పలువురు ఎమ్మెల్యేల్లో ఒకింత అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో టిక్కెట్టు రేసు మొదలైందనేలా నాయకుల కార్యక్రమాలు ఉంటున్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌లో మైనారిటీల తరువాత మున్నూరుకాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఆకుల లలిత సైతం ఈ స్థానం నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇందులో భాగంగానే లలిత నగరంలో మున్నూరుకాపు కార్తీక వనభోజనాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ వస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న లలిత, మరోసారి ఎమ్మెల్సీ హామీని కేసీఆర్‌ నుంచి పొంది టీఆర్‌ఎస్‌లో చేరారు. చివరి నిముషంలో సదరు ఎమ్మెల్సీ స్థానం కల్వకుంట్ల కవితకు కేటాయించారు. లలితకు రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. అయితే లలిత తన సొంత నియోజకవర్గం ఆర్మూర్‌ బదులు తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్‌ అర్బన్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. మున్నూరుకాపు నుంచి మహిళగా తనకు అవకాశం లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. 
చదవండి: రొటీన్‌గా చేస్తే పట్టించుకోం.. కానీ టార్గెట్‌గా నడుస్తోంది: మంత్రి తలసాని

పట్టు జారకుండా..
ఆకుల లలిత కార్యక్రమాల్లో పాల్గొంటుండగానే ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా కార్యక్రమాల్లో దూకు డు పెంచారు. నగర అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో నగరంలో ఈ నెల 16న భారీ ప్రదర్శన చేయించారు. మళ్లీ తనదే టిక్కెట్టు అన్న ధీమాతో ఉన్న గణేశ్‌గుప్తా పట్టు ఏమాత్రం జారకూడదనే సంకల్పంతో ముందుకు కదులుతున్నారు. ఇదిలా ఉండగా వైశ్య సామాజిక వర్గం నుంచి బీజేపీ తరపున ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా బలంగా దూసుకొస్తున్నారు. ధన్‌పాల్‌కు అన్నివర్గాల్లో తిరుగులేని ఫాలోయింగ్‌ ఉంది. ఈసారి ఆయనకు బీజేపీ నుంచి టిక్కె ట్టు కచ్చితంగా వస్తుందని వివిధ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇటు నుంచి బీజేపీ ద్వారా తన సామాజిక వర్గానికే చెందిన నాయకుడు బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా, మరోవైపు టీఆర్‌ఎస్‌ నుంచి ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న మున్నూరుకాపు సామాజిక వర్గం నాయకురాలు టిక్కెట్టు ఆశించే పరిస్థితి ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాకు నెలకొంది. నిజామాబాద్‌ అర్బన్‌ నియాజకవర్గంలో టిక్కెట్ల వేట ఇప్పటి నుంచే ప్రారంభమైందని వివిధ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌ తరపున బరిలోకి దిగేదెవరు, ఎంఐఎం బరిలోకి దిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం చోటుచేసుకుంటుందనే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వార్తలు