బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌.. నేతల మధ్య పొలిటికల్‌ వార్‌

18 Sep, 2023 13:47 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: తెలంగాణ పొలిటికల్‌ వాతావరణం మరోసారి హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ను మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించగా.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ను కా​ంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. 

ఇక, మంత్రి జగదీష్‌ రెడ్డి సోమవారం మీడియాతో​ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హామీలన్నీ భోగస్‌. ఆచారణ సాధ్యం కాని హమీలను తెలంగాణ ‍ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ నాయకుల మాటలు సినిమా పాత్రల్లో వేసే బఫ్యూన్ల పాత్రలాగా ఉన్నాయి. కాంగ్రెస్‌ నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్టును సోనియా, రాహుల్ చదివి వినిపించారు. హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ‌లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి హామీలు ఇవ్వలేదు.

కర్ణాటక పరిస్థితేంటి?
గతంలో 2 లక్షల రుణమాఫీ అన్నా ప్రజలు నమ్మలేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణతో సమానంగా బడ్జెట్ ఉన్న కర్ణాటకలో రైతుబంధు ఎందుకు ఇవ్వట్లేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మీద ఉన్న నమ్మకం కాంగ్రెస్ నాయకులపై లేదు. ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. కేసీఆర్ హామీలను కాపీ కొట్టి పథకాలు ఇస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు అంటూ కామెంట్స్‌ చేశారు. 

కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా ప్లాన్‌..
మరోవైపు, జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మొదటి సారి CWC సమావేశాలు హైదరాబాద్‌లో జరిగాయి. బీఆర్‌ఎస్‌కు అండగా బీజేపీ, ఎంఐఎం పనిచేస్తున్నాయని రాహుల్‌ గాంధీ నిన్నటి సభలో స్పష్టంగా చెప్పారు. ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వకుండా కుట్రలు చేస్తున్నాయి. దేశ ప్రజలు సంక్షేమం కోసం CWC సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తూ దేశాన్ని కలుషితం చేస్తోంది. కాంగ్రెస్‌ సెక్యూలర్‌ పార్టీ. అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుంది. మతాలను రెచ్చగొడుతూ అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ చూస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం: విజయశాంతి కామెంట్స్‌

మరిన్ని వార్తలు