మునుగోడు ఓటర్లకు దీపావళి ధమాకా ఆఫర్‌

21 Oct, 2022 09:10 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/చౌటుప్పల్‌ రూరల్‌/యాదగిరిగుట్ట: ఎన్నికల వేళ మునుగోడు ప్రజలకు ప్రధాన రాజకీయ పార్టీలు దీపావళి బంపర్‌ ఆఫర్‌లు అందిస్తున్నాయి. మహిళలకు చీరలు, పిల్లలకు స్వీట్లు, టపాసుల బాక్సులు సిద్ధమయ్యాయి. పురుషులకు మద్యం, మాంసం రెడీ. ఇప్పటికే కొన్నిచోట్ల పంపిణీ ప్రారంభించగా మరికొన్నిచోట్ల పంపిణీకి సిద్ధమవుతున్నాయి. యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.

ఓ గ్రామంలో యువతకు ఏకంగా దీపావళికి కొత్త బట్టలే కొనిస్తున్నారు. ఇప్పటివరకు గ్రామాల్లో ఆయా పార్టీలు స్థానికంగా ఉన్న పెద్ద మనుషులకు మాత్రమే అంతో ఇంతో ముట్ట చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏకంగా ఇంటింటికీ పంపిణీ జరుగుతుండడంతో గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. ప్రధాన పార్టీలు నోటిఫికేషన్‌కు ముందు నుంచి స్థానిక నేతలు, ప్రజల్లో బలమున్న నాయకులకు గాలాలు వేసి.. నజరానాలు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నాయి. ఆ తర్వాత ఇటు వారు అటు, అటు వారు ఇటు మారడం ముమ్మరంగా సాగింది. ప్రస్తుతం నేతలు ఇక ఓటర్లనే నమ్ముకొని నేరుగా ఓటర్లనే కలుస్తూ వారు అడిగింది కాదనకుండా ఇస్తున్న పరిస్థితి. ఇందు కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నామంటూ ఆయా పారీ్టల నేతలే చెబుతున్నారు. 

యాదాద్రి టూర్‌కి మల్కాపురం ఓటర్లు 
చౌటుప్పల్‌ మండలం మల్కాపురంలో 3009 మంది ఓటర్లు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు 15 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని వెయ్యి మంది ఓటర్లను యాదాద్రి నర్సింహస్వామి దర్శనానికి తీసుకెళ్లారు. వారిని రూ.150 క్యూలో తీసుకెళ్లి వీఐపీ దర్శనం చేయించి అవే బస్సుల్లో తీసుకొచ్చి ఊర్లో వదిలిపెట్టారు. 

ఎవరి లెక్కలు వారివే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికల్లో కులాల లెక్కలు ఆసక్తికరంగా మారాయి. ఎవరికి లెక్కలు వారే వేసుకుంటున్నారు. ఒక కులం ఓట్లను ఒక పార్టీ తక్కువగా వేసి చూపిస్తే మరో పార్టీ ఎక్కువగా వేసి చెప్పడం పరిపాటైంది. దీనిని ఆసరా చేసుకొని ఆయా పార్టీల్లో ఆయా కులాలకు చెందిన నాయకులు తమ పరపతిని పెంచుకునే పనిలోపడ్డారు. 

అందులో భాగంగా ఏ పార్టీకి ఏ కులం అనుకూలంగా ఉండదో ఆ కులం ఓటర్ల సంఖ్యను తక్కువగా చూపించడం, అనుకూలంగా ఉండే కులం ఓటర్ల సంఖ్యను ఎక్కువగా చూపించి తమ పబ్బం గడుపుకునే పనిలో పడ్డారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు కొందరు నాయకులు ఇచి్చన కులాల వారి లెక్కల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 35 వేలకుపైగా ఉన్నట్లు ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చెబుతుండగా, అది గిట్టని వారు తాము 21 వేల వరకే ఉన్నట్లు పార్టీలకు నివేదికలు ఇచ్చారని అంటున్నారు  
 

మరిన్ని వార్తలు