Hyundai Controversy: హ్యుందాయ్‌ ‘సారీ’.. వేడి చల్లారట్లేదు! మరో మలుపు తిరిగిన వివాదం

7 Feb, 2022 13:05 IST|Sakshi
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది.. పక్కన హ్యుందాయ్‌ సింబల్‌

హ్యుందాయ్ మోటార్స్ కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేస్తూ పెట్టిన ఒక పోస్టు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో #BoycottHyundai బాయ్‌కాట్‌ హుందాయ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అయ్యింది. వాహనదారులు హ్యుందాయ్ ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. చాలా మంది ఆ కంపెనీకి చెందిన కార్లను అస్సలు కొనవద్దు అని కోరారు.  కశ్మీర్ కోసం పాక్‌ చేసింది త్యాగాలైతే.. మరి ఏళ్లకేళ్లుగా భారతీయులు చేస్తున్నదేమిటి అంటూ కడిగిపడేశారు హ్యుందాయ్‌ని. 

ఈ నేపథ్యంలో కొరియన్‌ కార్ల కంపెనీ హ్యుందాయ్‌.. భారత ప్రజలకు క్షమాపణలు చెప్పింది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా.. హ్యాందాయ్‌ పాకిస్తాన్ విభాగం సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులలో సమర్ధించబోమని స్పష్టం చేసింది.  జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన తత్వానికి తాము కట్టుబడి ఉన్నామని హ్యూందాయ్‌(హెచ్ఎంఐఎల్) భారత విభాగం చెప్పుకొచ్చింది. కానీ.. 

రాజకీయ విమర్శలు
అయినా వివాదం చల్లారడం లేదు. పైగా ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ వివాదం రాజకీయ అంశంగా మారింది. పలువురు రాజకీయ నేతలు.. హ్యుందాయ్‌పై విరుచుకుపడుతున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది హ్యుందాయ్‌ తీరును తప్పుబడుతూ ఓ ట్వీట్‌ చేశారు. హ్యూందాయ్‌ ఇండియా ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన సందేశంలో అనవసరమైన పదాలు అక్కర్లేదని, స్పష్టంగా సారీ చెప్తే సరిపోయేదని, మిగతాదంతా అనవరసరమని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నేత డాక్టర్‌ విజయ్‌ చౌథాయివాలే సైతం హ్యుందాయ్‌పై విరుచుకుపడ్డారు. కేవలం సారీ సరిపోదని, వివరణ ఇవ్వాల్సిందేనని, ఇలా భారత్‌ వ్యతిరేకత వ్యాఖ్యలపై హ్యుందాయ్‌ గ్లోబల్‌ స్టాండ్‌ ఏంటో తెలియజేయాలని కోరారు.

ఏం జరిగిందంటే..  ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ పాకిస్తాన్ తన ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా చేసిన ఒక పోస్టులో.. "మన కశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుంచుకుందాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదాం" అని హ్యుందాయ్ #KashmirSolidarityDay అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి పోస్ట్ చేసింది. ఆపై పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తంకాగా.. ఆ పోస్టులు ఇప్పుడు తొలగించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ పోస్టు చేసిన ట్వీట్లను చాలా మందికి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్ వేదికగా యూజర్లు షేర్ చేస్తూ కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

మారుతీ సుజుకి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్. ప్రముఖ సబ్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ SUV అయిన క్రెటాతో సహా కంపెనీ 12 మోడళ్లను విక్రయిస్తోంది. డిసెంబర్‌లో, హ్యుందాయ్ 2028 నాటికి ఆరు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి భారతదేశంలో సుమారు ₹ 4,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ప్రకటించుకుంది.

చదవండి: హ్యుందాయ్ కంపెనీపై ఫైర్‌! ఏ రేంజ్‌లో అంటే..

మరిన్ని వార్తలు