మళ్లీ జంగిల్‌ రాజ్‌ దిశగా బిహార్‌?

11 Mar, 2021 03:22 IST|Sakshi

దుమారం రేపుతున్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య

మరోసారి తెరపైకి నేరాలు, శాంతిభద్రతల అంశం

నితీష్‌ సర్కార్‌పై కమలదళం గుస్సా

సాక్షి, న్యూఢిల్లీ: అసలు జంగిల్‌ రాజ్‌ అంటే ఏంటి..? బిహార్‌ వెనకబాటుతనానికి జంగిల్‌రాజ్‌ కారణమా..? బిహార్‌లో జంగిల్‌ రాజ్‌ అంశం మళ్లీ తెరపైకి రావటానికి కారణం ఏంటి..? బిహార్‌లో పరిస్థితులు జంగిల్‌ రాజ్‌ దిశగా అడుగులు వేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నేరాలు, అవినీతి, శాంతి భద్రతల సమస్యలకు ఒకప్పుడు కేరాఫ్‌ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న బిహార్‌లో మళ్లీ అదే అంశం తెరపైకి వస్తోంది. నేరాల విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సాధారణం. అయితే తాజాగా పాలకపక్షంలోని నాయకులే ఇప్పుడు జంగిల్‌రాజ్‌ గానం వినిపించడం వివాదానికి కారణంగా మారుతోంది.

అసలేంటి జంగిల్‌ రాజ్‌..?
1990 నుంచి 2005 వరకు బిహార్‌ను లాలూ ప్రసాద్‌–రబ్రీదేవి పాలించిన కాలాన్ని జంగిల్‌ రాజ్‌గా రాజకీయవర్గాలు అభివర్ణిస్తుంటాయి. జంగిల్‌రాజ్‌లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, ఇతర సంస్థల మధ్య నేరపూరిత సంబంధాలు ఎక్కువగా ఉండేవి. అంతేగాక చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డువచ్చే వారిని బహిరంగంగా బెదిరించడం, హింసాత్మకంగా వ్యవహరించడం ఒక ఫ్యాషన్‌గా కొనసాగేది. ఆ సమయంలో బిహార్‌ కిడ్నాప్‌లకు అడ్డాగా మారింది. రాష్ట్రంలోని వైద్యులు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలను పట్టపగలే గ్యాంగ్‌లు కిడ్నాప్‌ చేసి డబ్బులు వసూలు చేసేవారు. కొన్నిసార్లు డబ్బులు చెల్లించిన తర్వాత కూడా బాధితులను నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. గతంలో చేసిన ఒక సర్వే ప్రకారం 1992 నుండి 2004 వరకు బిహార్‌లో 32,085 కిడ్నాప్‌ కేసులు అధికారికంగా నమోదయ్యాయి.

లాలూ–రబ్రీ హయాంలో రాజకీయ హత్యలు పెద్ద ఎత్తున జరిగాయి. లాలూ అండతో ఆ సమయంలో సివాన్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన షాబుద్దీన్‌పై అనేక హత్యారోపణలు ఉన్నప్పటికీ, లాలూ ప్రసాద్‌ కారణంగా పోలీసులు కేసులు పెట్టేందుకు భయపడ్డారు. కిడ్నాప్‌లు, హత్యల నేపథ్యంలో చీకటి పడిన తర్వాత ఇంటి నుంచి బయటి రావాలంటే ప్రజలు వణికిపోయేవారు. బిహార్‌ పోలీసు గణాంకాల ప్రకారం కేవలం 2001–2005 మధ్య ఐదేళ్ళలో 18,189 హత్యలు జరిగాయంటే 1990 నుంచి 2000 మధ్య కాలంలో జంగిల్‌ రాజ్‌లో ఎన్ని హత్యలు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇదేగాక రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా, వాహనం కొన్నా స్థానిక గూండాలకు ‘రంగ్దారీ పన్ను’తప్పని సరిగా చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే వారిని గూండాలు హత్య చేసేవారు. అసలు లాలూ–రబ్రీదేవి అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జరగని నేరం అంటూ ఏదీ లేదు. అయితే లాలూ కుటుంబం అధికార పీఠానికి దూరమైన తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. ఆర్జేడీని ఎదుర్కొనేందుకు జంగిల్‌ రాజ్‌ను ఉదహరిస్తూ బీజేపీ, జేడీయూలు ఎన్నికల్లో ప్రజల ముందు నిలబడి విజయం సాధిస్తూ వచ్చారు. 

అలాంటిది ఇప్పుడు మళ్ళీ జంగిల్‌ రాజ్‌ పేరు చర్చనీయాంశంగా మారింది. సీతామర్హి బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్‌ కుమార్‌ ఇటీవల చేసిన ఒక ప్రకటన రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ప్రస్తుత నితీష్‌ కుమార్‌ ప్రభుత్వ హయాంలోనూ తన నియోజకవర్గం సీతామర్హిలో పెరుగుతున్న నేరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, 15 ఏళ్ల క్రితం జంగిల్‌ రాజ్‌ రాజ్యమేలిన విధంగా, ప్రస్తుతం బిహార్‌ జంగిల్‌ రాజ్‌ దిశగా అడుగులు వేస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరస్తులు పోలీసులకు ఏమాత్రం భయపడట్లేదని, ఈ కారణంగా సీతామార్హిలో రోజులో కనీసం మూడు నేర ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని, నేరాలను అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకొనే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని మిథిలేష్‌ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది.

సాధారణంగా శాంతిభద్రతలను ఒక సమస్యగా ప్రతిపక్షం మారుస్తోంది. అయితే బిహార్‌లో స్వపక్షం నుంచే ఈ ప్రకటనలు రావడం రాజకీయంగా నితీష్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కేవలం మిథిలేష్‌ కుమార్‌ మాత్రమే కాకుండా నేరాలతో పాటు శాంతి భద్రతల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సంజయ్‌ జైస్వాల్‌ సహా పలువురు నేతలు నితీష్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేగాక నేర నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ అవలంభిస్తున్న విధానాన్ని అనుసరించాలని కోరారు. పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలంటూ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను డిమాండ్‌ చేశారు. 

మరోవైపు బీజేపీ మిత్రపక్షం, అధికారపార్టీ అయిన జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) నాయకులు మాత్రం బిహార్‌లో జంగిల్‌ రాజ్‌ కాదు ఎంతో శాంతియుతంగా న్యాయమైన పాలన జరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. గత 15 ఏళ్ళుగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఏనాడూ రాలేదని నితీష్‌ మంత్రివర్గ సహచరుడు, జేడీయూ నేత అశోక్‌ చౌదరి వెల్లడించారు. మొత్తానికి బిహార్‌ అభివృద్ధికి జంగిల్‌ రాజ్‌ ఇమేజ్‌ ఏదో ఒక రూపంలో కచ్చితంగా అడ్డుపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు