కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలి: పొంగులేటి ఫైర్‌

30 Oct, 2023 11:17 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలని ప్రజలను ఆయన కోరారు. ఇదే సమయంలో తెలంగాణతో గాంధీ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. 

కాగా, పొంగులేటి సోమవారం నేలకొండపల్లి మండలం ఆరేగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘నవంబర్‌ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో మీ దీవెనలు ఇవ్వాలి. పది సంవత్సరాలపాటు తుపాకి రాముడు కథలు చెప్పి సీఎం కేసీఆర్‌ భారీగా ఆస్తులు సంపాదించుకున్నాడు. పదేళ్లలో ఐదు లక్షల కోట్ల అప్పులు చేశాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డబ్బుల సంచులతో వస్తారు. ఎంత అడిగితే అంత ఇస్తారు. మనం పన్నులు కట్టి ప్రభుత్వానికి డబ్బుల ఇస్తే.. వాటిని కొల్లగొట్టి మళ్లీ మన దగ్గరకే తీసుకువస్తున్నారు. 

తెలంగాణలో యాదవులు గొర్రెల కోసం డీడీలు కడితే ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో, ఇక్కడి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అబద్దాలు చెప్పేటప్పుడు తడుముకోకుండా చెప్పడంతో కేసీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే ఉపేందర​్‌ రెడ్డి ఇద్దరూ ఒక్కటే. ప్రజల గురించి పట్టించుకోని సీఎం కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలి. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలకు అడియాశలు చేసింది’ అని అన్నారు. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు చెక్‌.. బీఆర్‌ఎస్‌లోకి విష్ణువర్ధన్‌ రెడ్డి

మరిన్ని వార్తలు