జంగా, పొన్నాల వర్గీయుల బాహాబాహీ

3 Oct, 2020 08:45 IST|Sakshi
జనగామలో బాహాబాహీకి దిగిన కాంగ్రెస్‌ నేతలు

జనగామ కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విభేదాలు

తీవ్ర ఉద్రిక్తత.. చెదరగొట్టిన పోలీసులు  

సాక్షి, జనగామ: జనగామ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కొంతకాలంగా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని పీసీసీ పిలుపు మేరకు కేంద్ర వ్యవసాయ బిల్లును నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం ‘కిసాన్‌ బచావో–మజ్దూర్‌ బచావో దివస్‌’కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెంబర్తి కమాన్‌ వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు ఇరువర్గాలు పోటీ పడ్డాయి.

మరోవైపు పోటాపోటీగా నినాదాలు చేయడంతో మాటామాటా పెరిగి రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. శ్రవణ్‌కుమార్‌ సాక్షిగా ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. గల్లాలు పట్టుకుని ఒకరినొకరు నెట్టివేసుకుంటూ బూతులు తిట్టుకున్నారు. ఒక దశలో కొట్టుకున్నంత పనిచేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ హఠాత్‌ పరిణామాన్ని దాసోజుతో పాటు అక్కడున్న వారు చూసి నిశ్చేష్టులయ్యారు. దాసోజు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. పొన్నాల వర్గీయులపై జంగా రాఘవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో గొడవ సద్దుమణిగింది.  

చదవండి: అరవై ఏళ్లుగా గోస పడ్డాం...

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు