దళిత, గిరిజన ద్రోహి కేసిఆర్: పొన్నాల లక్ష్మయ్య

2 Aug, 2021 15:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఉప ఎన్నికల ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం గాంధీవభన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుధీర్ఘంగా కేబినెట్ భేటీ జరిగినా ఒక్క అధికారిక ప్రకటన రాలేదని మండిపడ్డారు. నాగార్జున సాగర్ అభివృద్ధిపై మంత్రి మండలిలో చర్చించిన తర్వాత మళ్లీ హాలీయాలో సమీక్ష దేనికని, కేవలం ప్రచార ఆర్బాటమని దుయ్యబట్టారు. హామీల అమలుపై సమీక్ష అంటున్న సీఎం కేసిఆర్, గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఎందుకు సమీక్షించలేదని సూటిగా ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి 15 రోజుల్లో నాగార్జున సాగర్‌లో ప్రజా దర్బార్ పెడతానన్న కేసీఆర్‌ మాట ఏమైందని నిలదీశారు. హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయనే సాగర్‌లో సీఎం పర్యటన చేపట్టారని మండిపడ్డారు.

తెలంగాణ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీరు ఎప్పుడు విడుదల చేస్తారో కేసీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో జూన్, జూలైలో సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేస్తే, కేసీఆర్‌ ప్రభుత్వం నిన్న నీరు విడుదల చేసిందని మండిపడ్డారు. ఆలస్యంగా నీరు విడుదల చేయడం వల్ల కృష్ణా నది నుండి 45 టీఏంసీల నీరు సముద్రం పాలైందని అన్నారు. దళిత బంధు కేవలం ఓట్లు దండుకోవడానికేనని, దలిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లను పక్కన పెట్టారని విమర్శించారు. ఇప్పుడు రూ.10 లక్షలు ఇస్తాననడం ప్రచార ఆర్బాటం కాదా? ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇస్తే దళితులు, గిరిజనులు స్వశక్తిగా ఎదుగుతారని అన్నారు. దళిత, గిరిజన ద్రోహి కేసిఆర్, భవిష్యత్తులో తెలంగాణ ద్రోహిగా కేసిఆర్ నిలుస్తాడని పొన్నాల లక్ష్మయ్య విరుచుకపడ్డారు. 
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు