ఆ నిర్ణయాన్ని కేసీఆర్‌ వెనక్కి తీసుకోవాలి

27 Dec, 2020 20:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొనుగోలు కేంద్రాల ఎత్తివేతని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉపసంహరించుకోవాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. 2005లో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ చైర్మన్‌గా ఉన్న సమయంలో మొక్కజొన్న, వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల వారీగా, మేజర్ గ్రామ పంచాయతీల వారీగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి.. పంట వేసినప్పటి నుండి కొనుగోలు చేసే వరకు నా బాధ్యత అన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రంలోని మొత్తం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామనే మాట వెనక్కి తీసుకోవాలి. ఎన్నికల హామీ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు. సన్న వడ్లు వేసుకోమని చెప్పి మద్దతు ధరలు కల్పించలేదు. ( తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం)

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు డ్రామా ఆడుతూ ఈరోజు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం అనేది రైతులకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. కాబట్టి మేం చూస్తూ ఊరుకోం. ‘జాగ్రత్త కేసీఆర్‌’ అని హెచ్చరిస్తున్నాం. పునరాలోచన చేయండి. రైతుల ఆగ్రహానికి గురి కావద్దని కోరుతున్నాను. కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను ఉపసంహరించుకోవాలి. లేకపోతే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మళ్లీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తా’’మని చెప్పారు.

మరిన్ని వార్తలు