యోగికే నల్లజెండా చూపించాక..

3 Feb, 2022 10:02 IST|Sakshi

లక్నో: పూజా శుక్లా. ఒకప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కాన్వాయ్‌నే అడ్డుకొని నల్ల జెండా చూపించిన ధీశాలి. ఆ తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డారు. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ లక్నో (నార్త్‌) నియోజకవర్గం నుంచి ఆమెను ఎన్నికల బరిలోకి దింపింది. 25 ఏళ్ల  పూజ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. యోగి ఆదిత్యనాథ్‌ గద్దెనెక్కిన దగ్గర్నుంచి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆ పోరాటాలే ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చాయి.

2017లో లక్నో యూనివర్సిటీలో హిందీ దివస్‌ ఉత్సవానికి యోగి వస్తుండగా పూజా శుక్లా మరికొంతమంది విద్యార్థులతో కలిసి కాన్వాయ్‌కి అడ్డం పడి నల్లజెండా చూపించి మరీ నిరసనలు చేపట్టారు. లక్నో యూనివర్సిటీలో యోగి పాదం మోపకూడదంటూ అడ్డుకున్నారు. ఫలితంగా 20 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.  జైలు నుంచి బయటకు వచ్చాక పీజీ చదవాలన్నా ఆమె ఆశలకి గండి పడింది. కేసులో బుక్కయినందుకు లక్నో యూనివర్సిటీ ఆమెకు పీజీలో అడ్మిషన్‌ నిరాకరించింది. పూజతో పాటు నిరసనలో పాల్గొన్న వారికీ ఉన్నతాభ్యాసానికి అవకాశం లేకపోవడంతో అందరూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ అధ్యాపకులపై దాడులకు దిగారు.

అప్పట్లో లక్నో యూనివర్సిటీ ఆందోళనలతో భగ్గుమంది. దీంతో మరోసారి పూజ కటకటాల వెనక్కి వెళ్లారు.  జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆమె ఏ మాత్రం వెనుకడుగు వెయ్యలేదు. యోగికి ఎదురొడ్డి నిలవడమే లక్ష్యంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. పౌరసత్వ చట్ట సవరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొని మూడోసారి కూడా జైలు పాలయ్యారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ను కలుసుకున్నారు. అప్పట్నుంచి ఎస్పీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  చివరికి లక్నో (నార్త్‌) సీటు దక్కించుకున్నారు. సీటు ఖరారు కాకముందు నుంచే ఆమె లక్నోలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యోగినే ఎదిరించిన పూజా శుక్లా ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేస్తానంటూ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ప్రతినబూనారు. బీజేపీ నేత నీరజ్‌ బోరాను ఆమె ఎదుర్కోవాల్సి ఉంది. యూపీ అభ్యర్థుల్లో అతి తక్కువ వయసు కూడా ఆమెదే. లక్నోలో పోలింగ్‌ నాలుగో దశలో ఫిబ్రవరి 23న జరగనుంది.     

మరిన్ని వార్తలు