UP Population Control Bill: అసెంబ్లీకి అన్వయిస్తే సగం మంది అనర్హులే

14 Jul, 2021 12:30 IST|Sakshi

UP Population Control Bill లఖ్‌నౌ: జనాభా నియంత్రణకు ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్‌ తీసుకువచ్చిన జనాభా నియంత్రణ బిల్లు అధికార పార్టీ మెడకు చుట్టుకుంటుందా ?  పైకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ప్రముఖులు ఈ బిల్లు సూపర్‌ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నా.. అంతర్గత సమావేశాల్లో దీనిపై గుర్రుగా ఉన్నటు సమాచారం.

జనాభా నియంత్రణే లక్క్ష్యం
జనాభా నియంత్రణ లక్క్ష్యంగా ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం బర్త్‌ కంట్రోల్‌, స్టెబిలైజేషన్‌, వెల్ఫేర్‌ బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులుగా ప్రకటించారు. ఈ నిబంధనే ఇప్పుడు అధికార పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. 

బీజేపీ మెడకే
ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అధికార బీజేపీకి 304 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బిల్లు కనున అసెంబ్లీ ఆమోదం పొంది చట్టంగా మారి.. అసెంబ్లీ ఎ‍న్నికలకు కూడా ఈ చట్టం వర్తిస్తే... ప్రస్తుత ఎమ్మెల్యేల్లో సగానికి పైగా పోటీకి అనర్హులు అవుతారు. ఎందుకంటే వీరందరికీ ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు.

అసెంబ్లీలో
ఉ‍త్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 387 సీట్లు ఉండగా ఇందులో అధికార పార్టీ బంపర్‌ మెజార్టీ సాధించింది. కమలం గుర్తు తరఫున మొత్తం 304 మంది అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అయితే ఇందులో 152 మంది ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండటం గమనార్హం. ఇక్కరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 137 మాత్రమే. మరో 15ను మందికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు. ఈ సమాచారం ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది. 

పార్లమెంటులో
ఇదే చట్టాన్ని పార్లమెంటుకు అన్వయిస్తే ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సభ్యుల్లో 168 మంది అనర్హులు అవుతారు. ఇక్కడ కూడా బీజేపీదే సింహభాగం. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన ఎంపీలు బీజేపీ తరఫున 105 మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మరీ విచిత్రం ఏటంటే జనాభా నియంత్రణ బిల్లు -2019ను ప్రైవేటు బిల్లుగా పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపిక చేసిన జాబితాలో ఉన్న బీజేపీ ఎంపీ, భోజ్‌పూరి నటుడు రవిశంకర్‌కి ఏకంగా నలుగురు పిల్లలు ఉన్నారు. 

భిన్న స్వరాలు
యోగి సర్కార్‌ జనాభా నియంత్రణ విధానాన్ని అధికార పార్టీలో పైకి ఎవరు విమర్శలు చేయకున్నా ‘ఆఫ్‌ ది రికార్డు’ సంభాషనల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారను. ఈ రోజు స్థానిక సంస్థలు రేపు అసెంబ్లీ ఎన్నికలు అంటే తమ పరిస్థితి ఏంటని  మథనపడుతున్నారు. పైగా క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే నాయకులు అనర్హులైతే, ఆ... అసంతృప్తి అంతా తమకు చేటు తెస్తుందేమో అని మల్లగుల్లాలు పడుతున్నారు. 

8 మంది పిల్లలు
యూపీ అసెంబ్లీ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారమే ఒక ఎమ్మెల్యేకు 8 మంది పిల్లలు ఉండగా మరో ఎమ్మెల్యేకు 7 గురు పిల్లలు ఉన్నారు. ఇక ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు 6 గురు పిల్లలు ఉన్నారు. 15 మందికి 5గురు సంతానం, 44 మందికి నలుగురు సంతానం ఉన్నారు. ముగ్గురు సంతానం కలిగిన ఎమ్మెల్యేలు 83 మంది ఉన్నారు. 

అధిక సంతానం కలిగిన             పిల్లలు
బీజేపీఎమ్మె‍ల్యేల సంఖ్య            సంఖ్య
1                                                  8
1                                                  7
8                                                  6
15                                                5
44                                                4
83                                                3
103                                              2
34                                                1
 

మరిన్ని వార్తలు