ఎంపీ ప్రగ్యా డాన్స్‌ వీడియో వైరల్‌.. కాంగ్రెస్‌ సెటైర్లు!

9 Jul, 2021 11:36 IST|Sakshi

MP Pragya Dance: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌కు సంబంధించిన డాన్సింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. భోపాల్‌లోని తన నివాసంలో బుధవారం ఇద్దరు యువతుల పెళ్లిళ్లు జరిపించిన ప్రగ్యా ఠాకూర్‌.. అప్పగింతల సమయంలో డీజే పెట్టించారు. ఈ సందర్భంగా అతిథులతో పాటు తాను సైతం పాటలకు కాలు కదిపారు. వారితో సరాదాగా స్టెప్పులేస్తూ చిరునవ్వులు చిందించారు. ఇక ఈ వీడియోపై మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘సోదరి ప్రగ్యా ఠాకూర్‌ బాస్కెట్‌ బాల్‌ ఆడటం చూసినపుడు.. ఎవరి సాయం లేకుండానే నడిచినపుడు... ఇదిగో ఇలా డాన్స్‌ చేసినపుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నిజానికి.. మాలేగావ్‌ కేసు విచారణలో కోర్టు ముందు హాజరు కాకుండా ఉండేందుకు అనారోగ్యంగా ఉన్నట్లు నటించి, బెయిలు మీద బయటకు వస్తారంతే. కానీ, ఇలాంటి వేడుకల్లో తను ఎంతో ఉత్సాహంగా ఉంటారు. 

ఏదేమైనా ఆమెను ఇలా చూస్తుంటే, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లే అనిపిస్తోంది’’ అని సోషల్‌ మీడియా వేదికగా భోపాల్‌ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌పై సలూజ విమర్శలు గుప్పించారు. కాగా, కొద్దిరోజుల క్రితం ప్రగ్యా ఠాకూర్‌.. బాస్కెట్‌బాల్‌ ఆడుతున్న వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక 2008 నాటి మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రగ్యా నిందితురాలు అన్న విషయం విదితమే. అనారోగ్య కారణాలు చూపి కోర్టుకు నేరుగా హాజరుకాలేనని, తన అభ్యర్థనను మన్నించాలని విజ్ఞప్తి చేయగా.. సానుకూల స్పందన లభించింది.

వాళ్లు నర్మద మిశ్రా కూతుళ్లు..
పేదరికంలో మగ్గిపోతూ... కూతుళ్లకు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్న కార్మికుడు నర్మద మిశ్రా బాధ్యతలు తాను తీసుకున్నట్లు ప్రగ్యా వెల్లడించారు. ‘‘ఒక తల్లిగా, తండ్రిగా, గురువుగా, స్నేహితురాలిగా.. ఆ ఇద్దరు అమ్మాయిలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నా ఆశీర్వాదాలు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి. వారికి ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి’’ అని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు