కాంగ్రెస్‌కు షాక్‌.. టీఎంసీలోకి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు

5 Jul, 2021 18:36 IST|Sakshi
కాంగ్రెస్‌ని వీడి టీఎంసీలో చేరిన మాజీ రాష్ట్రపతి కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ

టీఎంసీలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ

కోల్‌కతా: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో సోమవారం అభిజిత్‌ ముఖర్జీకి, టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకాలం కాంగ్రెస్‌లో ఉన్న అభిజిత్ తండ్రి మరణం తర్వాత టీఎంసీలో జాయినవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2011లో మొదటిసారి బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అభిజిత్. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో... ఆయన రాజీనామా చేసిన జంగీపూర్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు అభిజిత్‌ ముఖర్జీ.

అయితే 2019లో అభిజిత్ ఓటమి పాలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ మొదలు పెట్టిన మతపరమైన హింసను మమతా బెనర్జీ సమర్థవంతంగా అదుపు చేశారని అభిజిత్ చెప్పారు. దేశమంతటా బీజేపీని కంట్రోల్ చేసే శక్తి ఆమెకు ఉందన్నారు. కాంగ్రెస్‌లో ప్రాథమిక సభ్యత్వం తప్ప తనకు ఎలాంటి పొజిషన్ లేదని... టీఎంసీలోనూ సాధారణ కార్యకర్తగానే చేరినట్టు అభిజిత్ తెలిపారు. పార్టీ సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించారు. అయితే అభిజిత్‌ ముఖర్జీ నిర్ణయంపై ఆయన సోదరి షర్మిష్ట స్పందిస్తూ.. విచారకరం అంటూ ట్వీట్‌ చేశారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు చూసుకున్నారు అభిజిత్‌ ముఖర్జీ. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జట్టు కట్టడంపై అభిజిత్ ముఖర్జీ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ ఓట్ల వాటా పెరిగి ఉండేదని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అభిజిత్‌ ముఖర్జీ పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు