ఒక రూపాయి జీతం.. సీఎం‌కు ప్రధాన సలహాదారుగా పీకే‌

1 Mar, 2021 20:30 IST|Sakshi

చండీగఢ్‌‌: 2022లో పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం కోసం పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్‌ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. అందులో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. సోమవారం ప్రశాంత్‌ కిషోర్..‌ సీఎం కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌కు ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎం కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ప్రశాంత్‌ కిషోర్‌ నాకు ప్రధాన సలహాదారుగా నియమితులవడం చాలా సంతోషంగా ఉంది. పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసం తాము ఇద్దరు కలిసి పనిచేయడానికి ఎదురు చేస్తున్నా’ అని ఆయన తెలిపారు.
 

ప్రశాంత్‌ కిషోర్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు పంజాబ్‌ మంత్రి మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పదవి కేబినెట్‌ ర్యాంక్‌తో సమానం.  మంత్రి మండలి విడుదల చేసిన నియామక నోటిఫికేషన్‌లో ఆయన ఈ పదవిలో జీతంగా రూ.1 మాత్రమే తీసుకోనున్నట్లు పేర్కొంది.  ప్రభుత్వం అందించే అన్ని సౌర్యాలను ఆయన పొందుతారు. ఇక 2017లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 117 సీట్లకు గాను కాంగ్రెస్‌ 77 సీట్లను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్రశాంత్‌ కిషోర్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ప్రధాన సలహాదారుగా పని చేస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: విద్యార్థులతో రాహుల్‌ గాంధీ స్టెప్పులు : వైరల్‌

మరిన్ని వార్తలు