నితీశ్ భ్రమలో ఉన్నారు.. ఏదో చెప్పబోయి ఇంకేదో మాట్లాడుతున్నారు

9 Oct, 2022 12:49 IST|Sakshi

జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని ప్రశాంత్ కిశోర్ గతంలో తనకు సలహా ఇచ్చాడని బిహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నితీశ్‌కు వయసు మీదపడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. ఏదో మాట్లాడబోయి, ఇంకేదో మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. ఆయన ఇప్పుడు భ్రమలో ఉన్నారని, ఎవరినీ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. అందుకే రాజకీయంగా ఏకాకి అయ్యాననే బాధతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.

'నితీశ్ మొదట నేను బీజేపీ కోసం పనిచేస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత జేడీయూను కాంగ్రెస్‌ను విలీనం చేయమని సలహా ఇచ్చానని అంటున్నారు. ఒకవేళ నేను బీజేపీ కోసం పనిచేస్తే జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని ఎందుకు చెప్తా?. ఆ పార్టీని ఎందుకు బలోపేతం చేస్తా? ఈ రెండు ఎలా సాధ్యమవుతాయి? నితీశ్ కుమార్ చెప్పిన రెండు విషయాలకు పొంతన లేదు. మీడియాతో ఒకటి చెప్పబోయి ఇంకేదో చెబుతున్నారు. ఆయన చుట్టూ విశ్వాసపాత్రులు ఎవరూ లేరు. అందుకే భ్రమలో ఉన్నారు.' అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.
చదవండి: మా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలట

మరిన్ని వార్తలు