కోల్‌కతా ఓటరుగా ప్రశాంత్‌ కిషోర్‌.. పక్కా ప్లాన్‌తోనేనా?!

27 Sep, 2021 12:00 IST|Sakshi

కోల్‌కతా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పశ్చిమబెంగాల్‌ భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటరుగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ప్రశాంత్‌ కిషోర్‌ కీలక పాత్రపోషించారు. ఆయన ఇదివరకు బీహార్‌లోని ససారాం జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటరుగా ఉన్నారు. ఈ నెల 30న జరగనున్న భవానీపూర్‌ ఉపఎన్నికలో ప్రశాంత్‌కిషోర్‌ తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. IUI0656683 ఎపిక్‌ నెంబర్‌తో ఉన్న నివాసం ఆయన శాశ్వత నివాసంగా చూపబడింది. నియోజకవర్గ పరిధిలోని రాణిశంకరి లేన్‌లోని బూత్‌ నెం-2222లో పోలింగ్‌ స్టేషన్‌ ఉంది. భవానీపూర్‌ అసెంబ్లీ ఎన్నిక సమయంలో ప్రశాంత్‌ కిషోర్‌ కోల్‌కతాలో ఉండకుండా బయటకు తీసుకురావడానికి బీజేపీ ఎన్నికల కమిషన్‌ని బలవంతం చేయొచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పథకం​ ప్రకారం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

భవానీపూర్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడంతో బీజేపీ ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. టీఎంసీ అడ్వయిజర్‌గా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌ ఓటరుగా నమోదు చేసుకోవడంపై బీజేపీ మీడియాసెల్‌ ఇన్‌చార్జ్‌ సప్తర్షి చౌదరి ఫైర్‌ అయ్యారు. 'చివరికి బహిరాగాటో (బయటివ్యక్తి) భవానీపూర్‌ ఓటర్‌ అయ్యారు. కాబట్టి, బెంగాల్‌ కుమార్తె ఇప్పుడు బహిరాగాటో (బయటి) ఓటర్‌కు అనుకూలంగా ఉంటుందో లేదో తెలియదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  చదవండి: (యూపీ బరిలో ఒవైసీ అలజడి)

కిషోర్‌ను భవానీపూర్ ఓటర్‌ జాబితాలో చేరడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. కొద్ది రోజుల క్రితం సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ అగ్ర నాయకులను కలుసుకున్నారు. దీంతో అతను కాంగ్రెస్‌లో చేరవచ్చు అనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు. అయితే ఆయన పార్టీలో చేరే నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని పార్టీ వర్గాలు సూచించాయి.

ప్రశాంత్‌ కిషోర్ మొదట్లో 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత జేడీ(యు)లో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ పార్టీ నుంచి బహిష్కరించారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ వేదికను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. అతను పంజాబ్‌లో పార్టీ విజయానికి తోడ్పాటునందించాడు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సలహాదారుగా ఉంటూ, అతను ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  చదవండి: (కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్‌.. ముహుర్తం ఖరారు)

మరిన్ని వార్తలు