-

West Bengal Elections: ప్రశాంత్‌ వ్యూహాలకు పదును

10 Feb, 2021 10:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకిస్తున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రానున్న మూడు నెలల్లో  రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించి బెంగాల్‌లో‌ తిరుగులేని నాయకురాలిగా ఎదిగిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ ఎన్నికలు అసలైన సవాలు విసురుతున్నాయి. మరోవైపు కేంద్రంలో బలమైన ప్రభుత్వం, నాయకత్వం కలిగిన అధికార బీజేపీ బెంగాల్‌ కోటాపై కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది. దీనిలో భాగాంగానే ఏడాది ముందు నుంచే ఎన్నికల రణరంగంలోకి దిగింది. వ్యూహచతురత, ప్రత్యర్థిని దెబ్బతీయడంలో దిట్టగా పేరొందిన మమతను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని భావించిన కాషాయదళం.. దీదీకి ధీటుగా వ్యూహాలను అమలు చేస్తోంది.

మమతకు ఎదరుదెబ్బ..
టీఎంసీలో బలమైన నేతలుగా ఉన్న సీనియర్లును తమవైపు తిప్పుకుని.. అసెంబ్లీ ఎన్నికల నాటికి పైచేయి సాధించింది. జంగల్‌మహాల్‌, నందిగ్రాం ఆదివాసీ ప్రాంతాల్లో పట్టుకలిగిన సుమేందు అధికారిని బీజేపీలో చేర్చుకోవడం ద్వారా మమతను మానసికంగా, రాజకీయంగా కమలదళం దెబ్బతీయగలికింది. అంతేకాకుండా దీదీ మంత్రివర్గంలో కీలకమైన శాఖలను నిర్వరిస్తున్న కేబినెట్‌ మంత్రులు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకోవడం టీఎంసీలో పెను కల్లోలాన్ని సృష్టిస్తోంది. గత లోక్‌సభల ఎన్నికల ముందు వరకు కనీస ప్రభావం లేని కాషాయదళం.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో తన మార్కును స్పష్టంగా చూపించింది. ఎవరూ ఊహించిన రీతిలో ఏకంగా 18 ఎంపీ స్థానాలను గెలుచుకుని రాజకీయవేత్తలను సైతం ఆశ్చర్యంలో ముంచింది. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. 

వ్యూహాలపైనే రాజకీయ భవిష్యత్‌
ఈ క్రమంలోనే సుదీర్ఘ రాజకీయ అనుభవం, బలమైన పార్టీ పునాదులు కలిగిన మమతా బెనర్జీ అనుసరించే వ్యూహాలు ఆమె రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్‌-వామపక్షాలతో కూడిన కూటమి ఓవైపు.. తుఫానులా ముంచుకువస్తున్న బీజేపీ మరోవైపు దీదీకి సవాలు విసురుతున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉందని, వ్యూహాలకు మరింత పదును పెట్టకపోతే తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉందని ఆమె రాజకీయ సలహాదారులు ఇప్పటికే పసిగట్టారు. ఇప్పటికే పార్టీ సీనియర్లు వరుసపెట్టి రాజీనామా చేస్తుండటంతో.. మరోవైపు టీఎంసీకి మొన్నటి వరకు మద్దతుగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, ఆదివాసీ ఓటర్లు క్రమంగా దూరమవ్వడం మమతను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.  ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఐపాక్‌ చీఫ్‌ ప్రశాంత్‌ కిశోర్‌పై మమత బోలెడు ఆశలు పెట్టుకున్నారు. టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌.. మమతను ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించాలని పాచికలు వేస్తున్నారు.

వ్యక్తిగతంలో బీజేపీ వ్యతిరేక వైఖరి కలిగిన ఆయన.. బెంగాల్‌లో కాషాయ పార్టీని కట్టడి చేసేందుకు విలువైన సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి చవిచూసిన ప్రాంతాలపై దృష్టి సారించారు. జంగల్‌మహాల్‌ పరిధిలో ఎ‍స్సీ, ఎస్టీ, ఆదివాసీ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా దెబ్బతింది. బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మరోవైపు సువేందు అధికారి ప్రాతినిథ్యం వహిస్తున్న నందిగ్రాంతో పాటు జంగల్‌మహాల్‌ ఏరియాల్లో కూడా ఆయన అనుచరులకు మంచి పట్టుంది.

మమత విజయం కోసం ప్రశాంత్‌ శ్రమ
ఈ నియోజవర్గల్లో ఈసారి టీఎంసీని గెలిపించే బాధ్యతను ఈసారి ప్రశాంత్‌కు అప్పగించారు దీదీ. దీంతో రంగంలోకి దిగిన ఆయన  ఆయా నియోజకవర్గల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార కార్యక్రమాలను సైతం ఆయనే చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆశావహులతో పాటు జిల్లా స్థాయి నేతలను నేరుగా మమత దగ్గరకు తీసుపోతూ.. పార్టీని పటిష్ట స్థితికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సోషల్‌ మీడియా ప్రచార వ్యవహారాలకు సైతం నిపుణులను సిద్ధం చేశారు. మొత్తానికి ఈ  ఎన్నికల్లో మమత విజయం కోసం ప్రశాంత్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీజేపీ దూకుడు ముందు మమత ఏ విధంగా నిలుస్తారు అనేది ఎన్నికల అనంతరం తెలియనుంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 209 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 27, కాంగ్రెస్‌ 23, సీపీఎం 19 స్థానాల్లో విజయం సాధించాయి.

మరిన్ని వార్తలు