రాహుల్‌ గాంధీతో పీకే కీలక భేటీ..

13 Jul, 2021 18:32 IST|Sakshi

రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న రాహుల్‌-పీకేల భేటీ

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అవ్వడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్‌ గాంధీ ఢిల్లీ నివాసంలో మంగళవారం వీరు భేటీ అయ్యారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి వీరు చర్చించినట్లు సమాచారం. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌-నవజోత్‌ సింగ్‌ సిద్ధుల మధ్య సయోధ్య గురించి ఈ భేటీలో చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి.

దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌, హరీష్‌ రావత్‌ హాజరయ్యారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ప్రియాంక గాంధీ మంగళవారం లక్నోలో పర్యటించాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో పీకేతో భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది. 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. మోదీకి ధీటైన, బలమైన ప్రధాని అభ్యర్థి కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌తో ప్రశాంత్‌ కిషోర్‌ పలుమార్లు భేటీ అయ్యారు. ఆ తర్వాత శరద్‌ పవార్‌ నివాసంలో ఎనిమిది మంది విపక్ష పార్టీలకు చెందిన నాయకులు సమావేశం అయ్యారు. మిషన్‌ 2024 లక్ష్యంగా మూడో కూటమి ఏర్పాటు కోసమే వీరు భేటీ అయినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

అయితే కాంగ్రెస్‌ పార్టీ లేకుండానే సమావేశం కొనసాగింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ లేకుండా మూడో కూటమి ఏర్పాటు సాధ్యం కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్‌-పీకేల భేటీపై సర్వత్రా ఆసక్తి నేలకొంది. ఈ సమావేశంలో వీరు థర్డ్‌ ఫ్రంట్‌పై చర్చించనున్నారా లేక వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్‌ ఎన్నికల గురించి మాత్రమే చర్చిస్తున్నారా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. 
 

మరిన్ని వార్తలు