నితీశ్ కుమార్ ఆ పని చేస్తే చేతులు కలుపుతా.. ప్రశాంత్ కిశోర్‌ కీలక వ్యాఖ్యలు

15 Sep, 2022 16:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బిహీర్ సీఎం నితీశ్ కుమార్‌తో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్. ఆయనతో మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధమే అని స్పష్టం చేశారు. కానీ ఒక్క షరతు విధించారు. నితీశ్ సర్కార్‌ బిహార్‌లో ఒక్క ఏడాదిలో 10 లక్షల ముందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అలా అయితేనే మహాఘట్‌బంధన్‌లో తాను కూడా చేరతానని చెప్పారు. అంతేకాదు రెండో రోజుల క్రితం నితీశ్‌తో తాను భేటీ అయినట్లు ప్రశాంత్ కిశోర్ ధ్రువీకరించారు.

ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయినట్లు నితీశ్ బుధవారమే వెల్లడించారు. అయితే ఏ విషయాలపై మాట్లాడారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సాధారణంగానే సమావేశమైనట్లు పేర్కొన్నారు. వీరిద్దరి భేటీని జేడీయూ మాజీ నేత పవన్ వర్మ ఏర్పాటు చేయడం గమనార్హం.  ప్రశాంత్ కిశోర్‌తో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని, పాత స్నేహితుడే అని నితీశ్ వ్యాఖ్యానించడం మళ్లీ వీరిద్దరూ జతకడతారా? అనే ఊహాగానాలకు తెరలేపింది. ఇప్పుడు పీకే రియాక్షన్‌ చూస్తుంటే ఇది వాస్తవరూపం దాల్చే సూచనలే కన్పిస్తున్నాయి.

నెల రోజుల క్రితం ఏన్డీఏతో తెగదెంపులు చేసుకుని ఆర్‌జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో బిహార్‌లో మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పర్యటను వెళ్లి కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడే పీకేతో భేటీ కావడం చూస్తుంటే.. నితీశ్ పెద్ద ప్లాన్‌తోనే ముందుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.
చదవండి: ఆ వీడియో నిజమైతే నన్ను అరెస్టు చేయండి.. బీజేపీకి సిసోడియా సవాల్

మరిన్ని వార్తలు