ఫలితాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.. సాహెబ్‌ జీ అంటూ కౌంటర్‌ ఇచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌

11 Mar, 2022 11:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీతో దూసుకెళ్లింది. ముఖ్యంగా యూపీలో మరోసారి భారీ విజయాన్ని అందుకుంది. ఉత్తరప్రదేశ్‌ ఓట్లరు అధికార యోగి ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ నిర్ణయాలు, విధానాలను ప్రజలు నమ్మిన కారణంగాన తమ పార్టీకి భారీ మెజార్టీ వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల తీర్పును ప్ర‌జ‌లు 2022లోనే తెలియజేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా మోదీ వ్యాఖ్యలపై ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స్పందిస్తూ ప్రధానికి కౌంటర్‌ ఇచ్చారు. శుక్రవారం ట‍్విట్టర్‌ వేదికగా స్పందించిన ప‍్రశాంత్‌ కిషోర్‌.. మోదీ వ్యాఖ్యలను త‌ప్పుప‌ట్టారు. మోదీ వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్షాల‌పై సైకాల‌జిక‌ల్ అడ్వాంటేజ్ తీసుకోవ‌డానికి చేసినవే అని ఆరోపించారు. రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలను బేస్‌ చేసుకొని బీజేపీవైపు ఓటర్లను ఆకర్షించేందుకే ప్రధాని మోదీ తెలివిగా ఇలా మాట్లాడారని అన్నారు. ఈ విషయం సాహెబ్‌కు కూడా తెలుసంటూ సెటైరికల్‌గా విమర్శలు చేశారు.

ఈ క్రమంలోనే 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫలితాలు ఆ ఏడాదిలోని పరిణామాల వల్ల డిసైడ్ అవుతుంది తప్ప రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా కాదని కౌంటర్‌ ఇచ్చారు. ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని తెలిపారు. ఆయన వ్యాఖ్య‌ల‌కు జ‌నం ఆక‌ర్షితులు కావొద్దని అన్నారు. దీంతో ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు