రేవంత్‌ను నమ్మడం కరెక్టేనా?: మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

10 Aug, 2021 17:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రికి దళితులు, గిరిజనులు, బడుగు, బలహీనవర్గాలు యాదికొస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా సభలో విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్ర కరణ్ రెడ్డి మంగళవారం ప్రగతి భవన్‌ వేదికగా స్పందించారు. ప్రశాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిది రోజుకో పార్టీ, పూటకో మాట అని అన్నారు. చంద్రబాబు మోచేయి నీళ్లు తాగే రేవంత్‌ను నమ్మడం కరెక్టేనా? అని​ ప్రశ్నించారు.

దళితుల పేరుతో ఓట్ల డ్రామా ఆడే పార్టీ కాంగ్రెస్‌ అని ఆయన దుయ్య బట్టారు. దళితులకు పేలాలు పంచడం తప్ప కాంగ్రెస్‌ ఏం చేయలేదని, ఆదివాసీలను చంపిందే కాంగ్రెస్‌ పార్టీ అని ఆయన ఆరోపించారు. 1981లో ఇంద్రవెళ్లిలో వందలమంది ఆదివాసీ బిడ్డలు కాల్చివేతకు కారణం కాంగ్రెస్‌ పార్టీ కాదా అని పేర్కొన్నారు. ఆనాడు గిరిజనులను చంపి, ఇవ్వాళ స్మారకం కడతారా? అని ప్రశ్నించారు. శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. దళితుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ దేశం, రాష్ట్రంలో ఒక్క పథకం తెచ్చిందా?  60ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క దళిత వ్యక్తిని ప్రధానిని చేసిందా? అని ప్రశ్నించారు.

ఇక మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ..  రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని సూచించారు. భాష మార్చుకోకపోతే ప్రజలు చీదరించుకుంటారన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారం పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారని తెలిపారు. వాటికి సంబంధించిన రికార్డులు నివేదిక ఇవ్వాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పోడు భూముల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవ్వరికీ లేదన్నారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాబోయే 20 ఏళ్ళు టీఆర్‌ఎస్‌ అధికారంలోనే ఉంటుందని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని ఆయన హితవు పలికారు.

>
మరిన్ని వార్తలు