కరోనా అంతమవ్వాలని ప్రార్థించా

26 Nov, 2020 20:04 IST|Sakshi

వ్యాక్సిన్‌ వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని సూచన

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్

విఠల్ ఆలయంలో ప్రత్యేక పూజలు

26/11 ముంబై అమర వీరులకు నివాళి

షోలాపూర్: కరోనా రహిత సమాజాన్ని చూసే రోజు కోసం ప్రార్థించానని‌ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. గురువారం కార్తీకి ఏకాదశి సందర్భంగా షోలాపూర్ జిల్లా పంధర్‌పూర్‌లోని విఠల్ ఆలయంలో అజిత్ పవార్ ఆయన భార్య సునేత్రతో కలిసి ‘మహా పూజ’ను నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని, ప్రపంచం ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందే రోజు దగ్గర్లోనే ఉందని పవార్‌ అన్నారు. మహారాష్ట్రలో ఈ మధ్యకాలంలో వైరస్‌ అదుపులో ఉన్నట్లు అనిపించిందని అయితే గత కొన్ని రోజులుగా రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.  

26/11 ముంబై ఉగ్ర దాడిలోని అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. "మహారాష్ట్ర  మన అమరవీరుల త్యాగాలను, సాహసాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. మనముందున్న గడ్డు కాలాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నపుడే ఈ మహమ్మారిని అంతం చేయగలమ’ని పేర్కొన్నారు.  దేశంలో అత్యధికంగా కోవిడ్ -19 కేసులు మహారాష్ట్రలో ఉండగా, తర్వాత స్థానంలో కర్ణాటక ఉంది.  మహారాష్ట్రలో కొత్తగా  6,159 కేసులు నమోదు కావడంతో  మొత్తం  సంఖ్య17,95,959కు చేరింది. ఒక్క ముంబై మహానగంలోనే 2,78,590 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా