డీఎంకే ఘన విజయం.. ‘కేబినెట్‌’ రేస్‌ మొదలు

4 May, 2021 15:02 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. ముఖ్యంగా తిరువళ్లూరు జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేసింది. అందులో సీనియర్లు ఎక్కువమంది గెలుపొందడంతో మంత్రి పదవులపై ఆశావహుల సంఖ్య అధికమైంది. త్వరలోనే కొలువుదీరనున్న స్టాలిన్‌ కేబినెట్‌లో బెర్త్‌ కోసం రేస్‌ మొదలైంది.

సాక్షి, చెన్నై: జిల్లాలో విజయం సాధించిన నలుగురు సీనియర్‌ నేతలు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డీఎంకే పార్టీ ముఖ్యులు, స్టాలిన్‌ కుటుంబ సభ్యులను కలిసి అమాత్యులుగా అవకాశమివ్వాలని కోరుతున్న ప్రచారం జోరుగా సాగుతోంది. స్టాలిన్‌ కేబినెట్‌లో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎవరికి పీఠం దక్కుతుందో అనే చర్చ సర్వత్రా సాగుతోంది.  పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి డీఎంకేలో మోస్ట్‌ సీనీయర్‌. బలమైన దళిత నేత. రెండు సార్లు శ్రీపెరంబదూరు ఎంపీగా, పార్లమెంట్‌ విప్‌గా పని చేశారు. గత ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి 60 వేలు,  ప్రస్తుతం 93వేల మెజారిటీతో గెలుపొందారు. స్టాలిన్‌ వద్ద కూడా కృష్ణస్వామికి మంచి పేరుంది.  పార్టీ సీనియర్‌ టీఆర్‌ బాలుతో పాటు పలువురి ఆశీస్సులు ఉన్నాయి.

ఈసారి ఆయనకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది. అలాగే మైనారిటీ నేత నాసర్‌ కూడా మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. ఆయనకు విశ్వాసపాత్రుడిగా పేరుంది. స్టాలిన్‌ను తీవ్రంగా విమర్శించే మంత్రి పాండ్యరాజన్‌పై భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తిరువళ్లూరు నుంచి రెండోసారి విజయం సాధించిన వీజీ రాజేంద్రన్‌ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయనకు స్టాలిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్టాలిన్‌ సతీమణి దుర్గా స్టాలిన్, వీజీ రాజేంద్రన్‌ భార్య ఇందిర క్లాస్‌మేట్స్‌. స్టాలిన్‌ అల్లుడు శబరీశన్, సీనియర్లు దురైమురుగన్, ఎంపీ జగద్రక్షగన్‌ ఆశీస్సులు ఉన్నాయి.

అలాగే వీజీ రాజేంద్రన్‌ అల్లుడు పాలిమర్‌ టీవీ అధినేత. వీరందరితోపాటు ఆంధ్రకు చెందిన పెద్ద నాయకుడి ద్వారా మంత్రి పదవికి సిఫారసు చేయించుకుంటున్నట్లు తెలిసింది. అలాగే మాధవరం ఎమ్మెల్యే సుదర్శనం పేరు కూడా ప్రచారంలో వుంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా కన్వీనర్‌గా పని చేసిన సుదర్శనానికి స్టాలిన్‌ కుటుంబ సభ్యులతో మంచి సంబందాలు వున్నాయి. ఈ క్రమంలో అదృష్టం ఎవరిని వరిస్తుందో శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.  

చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర

మరిన్ని వార్తలు