President Election 2022: వేడెక్కుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ఏకగ్రీవమా, ఎన్నికా?

17 Jun, 2022 06:16 IST|Sakshi

బీజేపీ ఏకగ్రీవ మంత్రం

కుదరకుంటే ముస్లిం, లేదా మహిళ అభ్యర్థి!

విపక్షాల తలోదారి?

రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ  క్రమంగా వేడెక్కుతోంది. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న విపక్షాల ప్రయత్నాలు కొలిక్కి రాకుండానే బీజేపీ ‘ఏకగ్రీవ’ రాగం ఎత్తుకుని పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో దాదాపుగా 49 శాతం ఓట్లున్న బీజేపీకి ఒకటీ అరా పార్టీల మద్దతుతో తన అభ్యర్థిని గెలిపించుకోవడం సునాయసమని భావిస్తున్నారు. కానీ ఆజాదీ అమృతోత్సవ్‌ జరుపుకుంటున్న తరుణం గనుక రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది.

ఇందుకు విపక్షాలనూ ఒప్పించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ చీఫ్‌ నడ్డా రంగంలోకి దిగినా అన్ని పార్టీలూ ఏకతాటిపైకి తెచ్చే అవకాశాలు అంతంతే. మరోవైపు అభ్యర్థి ఎంపిక కోసమంటూ తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన విపక్షాల భేటీకి టీఆర్‌ఎస్, ఆప్, బీజేడీ వంటి పార్టీలు డుమ్మా కొట్టడంతో అస్పష్టత మరింత పెరిగింది. అందుకే బీజేపీ ఇప్పటికే తన అభ్యర్థి ఎంపిక కసరత్తును ముమ్మరం చేసింది. ఈసారి ముస్లింకు అవకాశమిస్తుందన్న అంచనాలున్నాయి.

ఇప్పటివరకు ముగ్గురు ముస్లింలు డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్, ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ , ఏపీజే అబ్దుల్‌ కలాం రాష్ట్రపతులయ్యారు. గత ఎన్నికలప్పుడు రాష్టపతి అభ్యర్థి పేరును బీజేపీ చివరి నిమిషం దాకా గోప్యంగా ఉంచింది. దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును ప్రకటించింది. 2002లోనూ ఎన్డీఏ హయాంలో నాటి ప్రధాని వాజ్‌పేయి కూడా ఇలాగే చివరి నిమిషంలో అనూహ్యంగా అబ్దుల్‌ కలాం పేరును ప్రకటించారు. ఈసారి ప్రచారంలో ఉన్న వారిని ఓసారి చూస్తే...

అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌  
రాష్ట్రపతి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌. యూపీలోని బులంద్‌షహార్‌కు చెందిన ఈయన విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, జనతాదళ్, బీఎస్పీ, లెఫ్ట్‌ పార్టీల్లో పని చేశారు. 2004లో బీజేపీలో చేరారు. మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ సస్పెండెడ్‌ నేత నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా అగ్గి రాజేసిన నేపథ్యంలో ముస్లింకు అత్యున్నత పదవిని కాషాయ పార్టీ కట్టబెట్టవచ్చన్న అభిప్రాయం బలంగా ఉంది.

ద్రౌపది ముర్ము  
ఆరు రాష్ట్రాల్లో ఆదివాసీల ఓట్లు గణనీయంగా ఉన్నందున ఈసారి ఆదివాసీలకు అవకాశమివ్వాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్టు ప్రచారముంది. తొలి చాయిస్‌గా జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము పేరు వినిపిస్తోంది. మహిళకు చాన్సిస్తే రానున్న పలు ఎన్నికల్లో మహిళల ఓట్లను మరింతగా రాబట్టవచ్చన్నది బీజేపీ వ్యూహమంటున్నారు. ద్రౌపదిది ఒడిశా గనుక కీలకమైన బిజూ జనతాదళ్‌ మద్దతూ లభిస్తుంది.

గులాం నబీ ఆజాద్‌
కాంగ్రెస్‌కు షాకిచ్చేలా ఆ పార్టీ అసంతృప్త నేత గులాం నబీ ఆజాద్‌ను బీజేపీ రంగంలోకి దించే చాన్స్‌ లేకపోలేదంటున్నారు. ఆజాద్‌ అనుచరులు ఇప్పటికే భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. కశ్మీరీ ముస్లిం నేతను రాష్ట్రపతిని చేస్తే ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టల్ని కొట్టొచ్చన్న యోచనా ఉందంటున్నారు.

గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్‌ అబ్దుల్లా
విపక్షాల తరఫున బరిలో దిగేందుకు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ నిరాకరించడంతో మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా పేర్లను మమత తెరపైకి తెచ్చారు. 77 ఏళ్ల గాంధీ బ్యూరోక్రాట్‌గా, దౌత్యవేత్తగా పలు దేశాల్లో పని చేశారు. పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గానూ చేశారు. 2017లో ఉపరాష్ట్రపతిగా పోటీ చేసి ఓడారు.

స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ గాంధీ మనవడిని దింపి బీజేపీని ఇరకాటంలో పెట్టవచ్చన్న ఆలోచన విపక్షాల్లో ఉంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్లో బీజేపీ హవాకు అడ్డుకట్ట వెయ్యాలంటే ఆ ప్రాంతానికి చెందిన ఫరూక్‌ను బరిలో దించే ఆలోచనా ఉంది. బీజేపీ ముస్లింకు అవకాశమిస్తే పోటీగా ఫరూక్‌ను దించాలని భావిస్తున్నాయి.

బీజేపీ నేత ముక్తార్‌ అబ్సాస్‌ నక్వీ, ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ అనుసూయ ఊకే, తెలంగాణ గవర్నర్‌ తమిళసై , కర్ణాటక గవర్నర్, దళిత నేత తావర్‌ చంద్‌ గెహ్లాట్, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ తదితరుల పేర్లు కూడా చక్కర్లు కొడున్నాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు