President Election 2022: బీజేపీ ఆకర్ష్‌!

17 Jun, 2022 06:09 IST|Sakshi

రాష్ట్రపతి ఎన్నికల్లో సొంత బలంతో నెగ్గాలని వ్యూహం

పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలకు ప్రోత్సాహం

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలో సొంత బలంతోనే తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు అధికార బీజేపీ ఆకర్ష్‌ మంత్రాన్ని జపిస్తోంది. ఎలక్టోరల్‌ కాలేజీలో ఓట్ల శాతాన్ని పెంచుకునేలా పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో పడింది. బిహార్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో వారికి గాలం వేసిన బీజేపీ, తాజాగా గోవా, హరియాణా, రాజస్తాన్‌పైనా కన్నేసింది.

బలం పెంచుకునే ఎత్తుగడలు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో బీజేపీకి 48.9 శాతం ఓట్లున్నాయి. ఇంకో 11,990 ఓట్లు కావాలి. ఇందుకోసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపక్ష ఎమెల్యేలకు గాలమేస్తోంది. బిహార్‌లో వికాస్‌శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ(వీఐపీ) పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలూ, హిమాచల్‌లోనూ  ఇద్దరు ఇండిపెండెంట్లు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలతో పాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకున్నారు.

మధ్యప్రదేశ్‌లో ఒకరిద్దరు ఎంపీలను కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోవాలో 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఏకంగా 10 మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. హరియాణాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ బిష్ణోయ్, రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఉద్ధవ్‌ థాకరేకు రాజ్‌నాథ్‌ ఫోన్‌
మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మహారాష్ట్ర సీఎం, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్‌ థాకరేతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికపై చర్చించుకున్నట్లు సమాచారం. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని రాజ్‌నాథ్‌ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇతర పార్టీల నాయకులతో సంప్రదింపులు జరపడానికి బీజేపీ అధిష్టానం రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డాలను నియమించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు