Opposition Meet: ముగిసిన విపక్షాల భేటీ.. ఉమ్మడి అభ్యర్థిపై ఏకగ్రీవ తీర్మానం

15 Jun, 2022 17:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో విపక్షాలు ఓ కీలక నిర్ణయానికి వచ్చాయి. పార్టీలకతీతంగా ఒక్కరిని మాత్రమే రాష్ట్రపతి రేసులో నిలబెట్టాలని విపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఈ మేరకు.. ఢిల్లీ కానిస్టిట్యూట్‌ క్లబ్‌లో భేటీ అనంతరం విపక్ష నేతలు ప్రకటించారు. అభ్యర్థి పేరు విషయంలో ఖరారు కోసం 21న మళ్లీ సమావేశం కానున్నాయి విపక్షాలు.

ప్రజాస్వామ్యానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న నష్టం నుంచి గట్టెక్కించేందుకు ఓ అభ్యర్థి కావాలి అని సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. శరద్‌ పవార్‌ రేసులో ఆసక్తి చూపించకపోవడంతో.. ఫరూఖ్‌ అబ్దుల్లాతో పాటు గోపాలకృష్ణ్‌ గాంధీ పేర్లను పరిశీలనలో ఉంచినట్లు సమాచారం.

► విపక్షాల సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని తీర్మానించాము. కొన్ని పార్టీల నేతలు బిజీగా ఉండటం వల్ల భేటీలో పాల్గొనలేదు. శరద్‌ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా అంతా ప్రతిపాదించాం. కానీ, ఆయన దీన్ని తిరస్కరించారు. దేశంలో పేరుకుపోయిన బుల్డోజర్‌ రాజకీయాలను అడ్డుకునేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలి. రాష్ట్రపతి అభ్యర్థి కోసం సంప‍్రదింపులు కొనసాగిస్తాం- మమతా బెనర్జీ

విపక్షాల భేటీలో..  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎవరి పేరును ప్రతిపాదించలేదని సమాచారం.

► మహారాష్ట్ర నేత, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌.. రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సున్నితంగా తిరస్కరించారు. విపక్షాల భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిగా మమతా బెనర్జీ, పవార్‌ పేరును ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. 81 ఏళ్ల వయసున్న శరద్‌పవార్‌.. తానింకా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నానని, ఆరోగ్య కారణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని విపక్ష భేటీలో చెప్పినట్లు తెలుస్తోంది.

తొలుత.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి శరద్‌ పవార్‌ అంటూ కథనాలు వినిపించాయి. అయితే ఆయన ఆ ప్రచారాన్ని తిప్పికొట్టినట్లు ప్రతికథనాలు వచ్చినా.. ఇప్పుడు విపక్షాల భేటీలో అది అధికారికంగా స్పష్టం అయ్యింది.

► రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో.. విపక్ష నేతలతో దీదీ నిర్వహిస్తున్నారు భేటీకి ఎంఐఎంకు ఆహ్వానం అందలేదు. దీనిపై ఒవైసీ స్పందించారు. ఒకవేళ ఆహ్వానం ఇచ్చినా.. ఆ భేటీకి వెళ్లేవాడిని కాదని చెప్పారాయన. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కారణం. కాంగ్రెస్‌ను ఆహ్వానించారు కాబట్టే.. ఆ భేటీకి రామని చెప్పేవాళ్లం. మమతా పార్టీ టీఎంసీ ఇంతకు ముందు తమ పార్టీ(ఎంఐఎం) గురించి చాలా దారుణంగా మాట్లాడిందని... అలాంటప్పుడు ఆమె నిర్వహించే భేటీకి ఎలా హాజరవుతామని ఒవైసీ అన్నారు. 

► రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్ భావిస్తున్నారు.

► కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, సీపీఎం-ఎల్‌, ఆర్‌ఎస్పీ, శివ సేన, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎస్పీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, జేడీ(ఎస్‌), డీఎంకే, ఆర్‌ఎల్డీ, ఐయూఎంఎల్‌, జేఎంఎం..  ప్రతినిధులు హాజరయ్యారు.

► రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, దేశంలోని పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఐక్యంగా ఎదుర్కొనే అంశాలపై చర్చిస్తున్నాయి విపక్షాలు. 

► రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున అభ్యర్థిని నిలబెట్టేందుకు టీఎంసీ అధినేత్రి, వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాల సమావేశం జరుగుతోంది.

► ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో విపక్షాల భేటీ జరుగుతోంది. 

► ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరుకాకపోవడం గమనార్హం.

► భేటీకి కాంగ్రెస్‌  తరుపున ఖర్గే, జైరాం రమేష్‌, అఖిలేష్‌ యాదవ్‌, సూర్జేవాలే, శరద్‌ పవార్‌ తదితరులు హాజరయ్యారు. 

► శివసేన నుంచి ఎంపీ ప్రియాంక చతుర్వేది,  సీపీఐ నుంచి డి. రాజా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ఒమర్‌ అబ్దుల్లా, ఆర్జేడీ నుంచి మనోజ్‌ ఝా, సీపీఎం నుంచి ఎలమరం కరీం హాజరయ్యారు.

► క్లబ్‌ బయటకు వచ్చి మరీ విపక్షాల నేతలను రిసీవ్‌ చేసుకున్నారు మమతా బెనర్జీ. పలు రాష్ట్రాల ముఖ్యమం‍త్రులతో సహా మొత్తం 19 మందికి ఆహ్వానం పంపారు దీదీ. 

► మమతా బెనర్జీ నేతృత్వంలో వివపక్షాల సమావేశానికి.. కాంగ్రెస్‌తో కలిసి కూర్చోలేమంటూ టీఆర్‌ఎస్‌ ఈ భేటీకి దూరం కాగా, ఆప్‌, అకాళీదళ్‌, బీజేడీ సైతం మమతా బెనర్జీ విపక్షాల భేటీకి గైర్హాజరు అయ్యాయి. 

మరిన్ని వార్తలు